Sankranti: పల్లెలకు కదిలిన జనం.. బస్సులు, ట్రైన్‌లు ఫుల్
ABN , Publish Date - Jan 11 , 2025 | 10:47 AM
Sankranti Festival: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం టీఎస్సార్టీసీ ప్రత్యేకంగా 6432 బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, ఆరంఘార్ బస్‌స్టాండ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని జిల్లాలకు 1600 వందల బస్సులు, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళిక చేశారు.
హైదరాబాద్, జనవరి 11: సంక్రాంతి పండుగ (Sankrati Festival) సందర్భంగా స్కూళ్లకు వరుసగా సెలవులు రావడంతో హైదరాబాద్ ప్రజలు పల్లెలకు బయలుదేరారు. సొంత వాహనాలు ఉన్న వారు నిన్నటి నుంచే సొంతూళ్లకు పయనమయ్యారు. మరోవైపు బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికుల సందడి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లే వారితో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్‌లు కళకళలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు పల్లెబాట పట్టడంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. నిన్నటి నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్ధం టీఎస్సార్టీసీ ప్రత్యేకంగా 6432 బస్సులను నడుపుతోంది. ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్పీనగర్, ఆరంఘార్ బస్‌స్టాండ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని జిల్లాలకు 1600 వందల బస్సులు, ఏపీ వైపు 300 ప్రత్యేక బస్సులను నడిపేలా ప్రణాళిక చేశారు.
వారికి మంత్రి పొన్నం హెచ్చరికలు..
అయితే ఈ స్పెషల్ బస్సుల్లో అదనంగా 50 శాతం చార్జీలను వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండగ రద్దీని ఆసరగా చేసుకుని ఎక్కువ చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులను మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. ఎక్కువ చార్జీలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ బస్సులన్నీ ఫుల్ అయ్యాయి. పండుగ ముందు, తర్వాత కూడా వంద శాతం బుగింక్ పూర్తి అయ్యింది. ఈనెల 20 వరకు బస్సులేవీ ఖాళీ లేకపోవడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. చేసేదేమీ లేక డబ్బులు ఎక్కువైనా చాలా మంది ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు దోపిడీకి పాల్పడుతున్నారు.
పెరిగిన విమాన చార్జీలు...
ఇక సంక్రాంతి సందర్భంగా 366 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. చర్లపల్లి టెర్మినల్ నుంచి ఏపీలోని నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం ప్రాంతాలకు 59 ప్రత్యేక రైళ్లను వేశామని అధికారులు చెప్పారు. 11, 12 తేదీల్లో చర్లపల్లి - విశాఖపట్నం - చర్లపల్లి వరకు సాధారణ కోచ్‌లతో 16 రైళ్లను నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక అన్‌రిజర్వ్‌కోచ్‌డ్‌లో వెళ్లే ప్రయాణికులు కౌంటర్ల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేకుండా మొబైల్ యాప్‌లో యూటీఎస్ ద్వారా టికెట్‌లు పొందడానికి అవకాశం ఉందని తెలిపారు. అలాగే పండగ నేపథ్యంలో విమాన ఛార్జీలు మూడు రెట్లు పెరిగాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు శని, ఆదివారాల్లో గరిష్టంగా రూ.17వేల నుంచి రూ.18 వేల మధ్య టికెట్ ధరలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి...
దేవుడా.. నీకు మనసెలా వచ్చిందయ్యా..
Read Latest Telangana News And Telugu news