T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:03 PM
T Congress Leaders: ఉగాది పండగ లోపు రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణను పూర్తి చేయాలనే లక్ష్యంతో పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో వారు సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో వారు భేటీ కానున్నారు.

హైదరాబాద్, మార్చి 24: పార్టీ అధిష్టానం పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కానీ.. ఏఐసీసీ నూతన కార్యాలయంలో కానీ పార్టీ అధిష్టానం పెద్దలతో వీరంతా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిపై చర్చించనున్నారు.
సామాజిక సమీకరణలతోపాటు గతంలో ఇచ్చిన హామీల మేరకు వీటిని భర్తీ చేయాలని పార్టీ అధిష్టానాన్ని వారు కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశానికి తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్‌తోపాటు టీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం హాజరు కానున్నారు. ఇక ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఉన్నారు.
మరోవైపు.. రేవంత్ కేబినెట్‌లో ఆరుగురికి మంత్రి పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్చి 30వ తేదీ ఉగాది. ఈ పండగ నాటికి కేబినెట్ కూర్పును పూర్తి చేయాలనే లక్ష్యంతో పార్టీ అధిష్టానం కృత నిశ్చయంతో ఉందని సమాచారం. ఆ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించారనే చర్చ సాగుతోంది.
ఇంకోవైపు రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కేబినెట్‌లో చోటు లేదు. దీంతో ఆ యా జిల్లాల్లోని వివిధ సామాజిక వర్గాల నేతలంతా రేసులో ఉన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డితోపాటు పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ సాగర్ రావుతోపాటు ఎమ్మెల్యే వివేక్ పేరు సైతం వినిపిస్తోంది.
వాకాటి శ్రీహరి ముదిరాజ్ పేరు వినిపిస్తోంది. అదే విధంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి పేరు సైతం వినిపిస్తోంది. అయితే ఎంపీ ఎన్నికల్లో భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే.. కేబినెట్‌లో బర్త్ కేటాయిస్తామంటూ అధిష్టానం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చినట్లు ఓ చర్చ సైతం గతంలో వైరల్ అయింది. ఆయన గెలుపుతో తనకు కేబినెట్‌లో చోటు కన్‌ఫార్మ్ అని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అదీకాక.. రాజగోపాల్ రెడ్డికి కేబినెట్‌లో చోటు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అనంతరం వీరంతా ఈ రోజు రాత్రి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు సైతం కేబినెట్‌లో కూర్పు కోసం జరుగుతోన్న చర్చలో వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News