Sub-Categorize Scheduled Castes: దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం దిశగా.. కీలక బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం..
ABN , Publish Date - Mar 18 , 2025 | 06:07 PM
ఎట్టకేలకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. దీంతో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు ఇప్పటివరకు అమలు చేస్తుండగా.. తాజాగా మూడు గ్రూపులుగా విభజించి ఈ 15 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.

దీర్ఘకాలికంగా ఎటూ తేలకుండా ఉండిపోయిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును తెలంగాణ శాసనసభ ఆమోదించింది. గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పుతో ఎస్సీ వర్గకరణకు లైన్ క్లియర్ కావడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తాజాగా తెలంగాణ శాసనసభ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలవుతుండగా.. వీటిని వివిధ గ్రూపులుగా విభజించి అమలు చేయనున్నారు. ఇప్పటివరకు ఎస్సీ సామాజికవర్గంలో మాల, మాదిగలతో పాటు ఇతర ఉప కులాలందరికీ కలిపి ఈ రిజర్వేషన్లు అమలు చేసేవారు. దీంతో తక్కువ శాతం జనాభా ఉన్న వారు ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారంటూ అనేక ఉద్యమాలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో మాదిగల సంఖ్యకు తగిన విధంగా రిజర్వేషన్లు రావడంలేదంటూ రిజర్వేషన్లను వర్గీకరించాలంటూ ఎమ్మార్పీఎస్ ఓ ఉద్యమాన్ని చేపట్టింది. కొన్ని రాష్ట్రాలు వర్గీకరణను అమలుచేసే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆ తర్వాత కోర్టు కేసుల కారణంగా అవి నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా న్యాయస్థాన తీర్పుతో చిక్కుముడి వీడినట్లైంది.
ఏన్నో ఏళ్లుగా..
ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా 15 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఈ కోటాలో మాలలే ఎక్కువుగా లబ్ధిపొందుతున్నారంటూ 1970 సంవత్సరంలోనే ఉద్యమం మొదలై.. కాలక్రమేణా తీవ్రరూపం దాల్చింది. జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్ మాదిగల నుంచి వినిపించింది. విద్య, ఉద్యోగాల్లో మాదిగలు తక్కువుగా ఉన్నారనే డిమాండ్‌తో వర్గీకరణ ఉద్యమం ఊపందుకుంది. మాదిగల పోరాటంతో 1995లో ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ మాదిగల వాదన నిజమేనంటూ 1996లో నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ఆధారంగా చేసుకుని 1997 జూన్‌లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను ఏ, బీ, సీ, డీగా వర్గీకరిస్తూ జీవో విడుదల చేసింది. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం చేసింది. దీనిని అసెంబ్లీ ఆమోదించగా రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది.2004లో దీనిని సుప్రీంకోర్టు కొట్టివేయడంతో చట్టానికి చుక్కు ఎదురైంది. ఎస్సీ కులల జాబితాలో జోక్యం, రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రప్రభుత్వాలు లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పడంతో అప్పటినుంచి ఈ సమస్య పెండింగ్‌లో పడింది. 2024లో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణ జనాభా ప్రాతిపదికన కల్పి్ంచే అధికారం రాష్ట్రాలకు ఉందని తీర్పు ఇవ్వడంతో వివిధ రాష్ట్రప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు చేపట్టాయి.
తెలంగాణలో..
తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం జస్టిస్ షమీమ్ అక్తర ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించిన నివేదిక ప్రకారం మూడు గ్రూపులుగా విభజించి వర్గీకరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసింది. ఎస్సీలో 3.288 శాతంగా ఉన్న వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1లో చేర్చి వీరికి 1శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. మధ్యస్థంగా లబ్ధిపొందిన 62.748 శాతంగా ఉన్న 18 కులాలను గ్రూప్-2లో చేర్చి వీరికి 9శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. మెరుగైన ప్రయోజనం పొంది 33.963 శాతంగా ఉన్న 26 కులాలను గ్రూప్-3లో చేరుస్తూ వీరికి 5శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. వాస్తవానికి జనాభా ప్రాతిపాదికన తమకు 11 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని మాదిగలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ భవిష్యత్తులో తగాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం మూడు గ్రూపులుగా వర్గీకరించి బిల్లును ప్రవేశపెట్టగా అసెంబ్లీ ఆమోదించింది.
ఇవి కూడా చదవండి...
DK Aruna Home Theft Case: డీకే అరుణ ఇంట్లో చోరీ కేసులో కీలక పరిణామం
Hyderabad crime news: పనిలో చేరిన 16 గంటల్లో ఊహించని షాకిచ్చిన మహిళ
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here