Paper Leak: వాట్సాప్‌లో ప్రశ్నపత్రంపై విచారణ
ABN , Publish Date - Mar 23 , 2025 | 05:08 AM
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్‌మెంటల్ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు.

ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసిన నల్లగొండ కలెక్టర్.. విధుల నుంచి పరీక్ష కేంద్రం సీఎస్, డీవో తొలగింపు
ఫొటో తీసిన వారి ఆచూకి కోసం పోలీసుల దర్యాప్తు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనపై నల్లగొండ జిల్లా అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఓ ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేయగా, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోపాటు డిపార్ట్‌మెంటల్ అధికారి(డీవో)ని విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లోకి రావడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి విచారణకు ఆదేశించారు. ఘటనకు సంబంధించి ప్రాథమికంగా నకిరేకల్ ఎస్సీ గురుకుల పరీక్షా కేంద్రంలో విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్ సుధారాణిని సస్పెండ్ చేశారు. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్‌మెంటల్ అధికారి రామ్మోహన్‌రెడ్డిని ఆయా విధుల నుంచి తొలగించారు. ఒకవైపు ఈ ఘటనపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు సైతం విచారణ చేపట్టారు. ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసిన వ్యక్తి పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్నవారా? లేక బయట నుంచి వచ్చిన వారా? ఎవరి కోసం ఈ ఫొటో తీశారు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. ప్రశ్నపత్రం ఏయే ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లోకి చేరిందనే సమాచారం సేకరిస్తున్నారు. విచారణ అనంతరం నివేదికను కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఈవో భిక్షపతి తెలిపారు.
బస్సు చక్రాల కిందపడి విద్యార్థిని మృతి
పదో తరగతి పరీక్ష రాసి ఇంటికొస్తున్న విద్యార్థినిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్న ఒడిశా వాసి బెనుధర్ కుమార్తె ప్రభాతి(19) స్థానికంగా విజయభారతి స్కూల్‌లో పదోతరగతి, కుమారుడు సుమంత్ డిప్లొమా చదువుతున్నారు. రాయదుర్గం జడ్పీహెచ్‌ఎ్‌స కేంద్రంలో పరీక్ష రాసిన ప్రభాతిని ఆమె సోదరుడు సుమంత్ బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి బయల్దేరారు. గచ్చిబౌలి ప్లైఓవర్‌పై వీరి బైక్‌ను డబుల్‌డెక్కర్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడంతో అన్న, చెల్లి ఇద్దరు కిందపడిపోయారు. ఈ క్రమంలో ప్రభాతి పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. సుమంత్‌కు గాయాలయ్యాయి. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వాటర్ క్యాన్లు తీసుకువెళ్లే ఆటో ఢీ కొట్టడం వల్లే వారు కింద పడ్డారని బస్సు డ్రైవర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థికి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు కాగా, ఆ గాయాలతోనే పరీక్షకు హాజరయ్యాడు. ఖమ్మం నగర పరిధిలోని వైఎ్‌సఆర్ నగర్‌కు చెందిన షేక్ అసన్.. తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనపై తండ్రి జానీమియా తలకు గాయాలు కాగా, అసన్‌కు స్వల్పగాయాలయ్యాయి. సమయం మించిపోతుండడంతో ఎలాగోలా పరీక్షా కేంద్రానికి చేరుకున్న అసన్.. పరీక్ష రాస్తుండగా వాంతులు చేసుకున్నాడు. అక్కడి సిబ్బంది సమాచారం మేరకు 108లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేశాక, మళ్లీ అతడు పరీక్ష రాశాడు. కాగా, వికారాబాద్ జిల్లా దోమ మండలం ఊటుపల్లికి చెందిన విద్యార్థిని రిషిక.. పరిగిలోని జడ్పీ ఉన్నత పాఠశాల-2లో హిందీ పరీక్ష రాస్తూ.. ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోయింది. వెంట నే ఆ విద్యార్థినిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యార్థిని కాసేపటికి కోలుకోవడంతో తిరిగి కేంద్రానికి తీసుకురాగా... పరీక్ష రాసింది. రక్తం పంచుకొని పుట్టిన చెల్లి మరణించినా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థి పరీక్ష రాశాడు. నిజామాబాద్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన సాయిలు, వినోద దంపతులకు పల్లవి(12), లక్ష్మిగణసాయి ఇద్దరు పిల్లలు. పల్లవి కొంత కాలంగా లుకేమియాతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఒకవైపు చెల్లి మృతి చెంది నా.. ఆ దుఃఖాన్ని దిగమింగుకొని గణ సాయి పరీక్ష రాసిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.