Betting Apps: ‘బెట్టింగ్ యాప్’ నిందితులకు 24 గంటల్లో నోటీసులు!
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:41 AM
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

సినీ, టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం
ఇప్పటికే పంజాగుట్టలో నమోదైన కేసులో 11 మందికి జారీ.. విచారణకు హాజరైన నలుగురు
కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు యాంకర్ శ్యామల..
24న విచారణకు హాజరై సహకరించాలన్న ధర్మాసనం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
బెట్టింగ్ యాప్‌ల ప్రచారం వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదైన నేపథ్యంలో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో కేసులో 11 మంది ఉండగా.. వారిలో 8 మంది మియాపూర్ కేసులోని వారేనని పోలీసులు తెలిపారు. అయితే మియాపూర్ కేసులో పలువురు సినీ ప్రముఖులు ఉండటంతో అన్ని న్యాయపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సినీ నటులతో బెట్టింగ్ యాప్‌ల అగ్రిమెంట్లపై ఇప్పటికే దాదాపు 15 బెట్టింగ్ యాప్ సంస్థలను గుర్తించారు. రెండు చోట్ల కేసుల నమోదైన వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా పోలీసులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో బాఽధితుల వివరాలతో పాటు ఫణీంద్రశర్మ తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిశీలించి దానికి సంబంధించిన ఆధారాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక పంజాగుట్ట పీఎ్‌సలో కేసులు నమోదైన నిందితులకు ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ నోటీసులిచ్చారు. ఇప్పటివరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. మిగతావారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
24న పోలీసుల విచారణకు హాజరు కండి..: హైకోర్టు
బెట్టింగ్ యాప్‌ల వ్యవహారంలో పోలీసులు చేపట్టే దర్యాప్తునకు సహకరించాలని.. ఈనెల 24న దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌ల కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని పేర్కొంటూ ఆమె హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. తప్పుడు ఆరోపణలతో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు పెట్టారన్నారు. నోటీసు ఇచ్చినప్పటికీ విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 (సీఆర్పీసీ 41ఏ) నోటీసు ఇవ్వాలని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పిటిషనర్ సోమవారం పోలీసుల ఎదుట హాజరై.. దర్యాప్తుకు సహకరించాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీచేసింది.
108 అక్రమ బెట్టింగ్ యాప్‌ల బ్లాక్..
రాష్ట్రంలో బెట్టింగ్‌పై నిషేధమున్న నేపథ్యంలో తమకు అందిన ఫిర్యాదుల మేరకు 108 అక్రమ బెట్టింగ్ యాప్‌లను బ్లాక్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షిఖా గోయల్ శుక్రవారం తెలిపారు. అలాగే ఇక్కడి వారికి లాగిన్ యాక్సిస్ ఇస్తున్న 133 భారత బెట్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. బెట్టింగ్ వెబ్‌సైట్లను అడ్డుకోవడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తోందని, అయితే ఇందులో చాలావరకు విదేశాల పరిధిలో ఉంటున్నాయని వివరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్సహించినా, పాల్గొన్నా కూడా తెలంగాణ గేమింగ్ చట్టం 2017 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడు బలి..
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతడు.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కొరవేన సాయితేజ (26) గోదావరిఖనిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన సాయితేజ రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మానసికంగా కుంగిపోయిన అతడు.. ఈనెల 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయితేజ ఆరేళ్ల కింద ప్రేమ వివాహం చేసుకోగా కుమారుడు, కుమార్తె ఉన్నారు.