Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో జాప్యం!
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:24 AM
రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది.

సమీక్షలంటూ అధికారులంతా బిజీబిజీ.. సాంకేతిక సమస్యలు.. ముందుకుసాగని పథకం
గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి
గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గూడులేని నిరుపేదలకు ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకంలో సంస్థ అఽధికారుల తీరుతో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసి అసలైన లబ్ధిదారులకు మేలు చేయాల్సిన కీలక అధికారులు అవలంబిస్తున్న విధానాలు శాఖలో ఇబ్బందిగా మారుతున్నట్టు ఉద్యోగులు వాపోతున్నారు. అధికారులు నిత్యం సమావేశాలు, సమీక్షలు అంటూ బిజీబిజీగా వ్యవహరిస్తున్నా ఇళ్ల పథకం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు కదలడం లేదు. అధికారుల తీరు ఒకవైపు.. సాంకేతిక సమస్యలు మరోవైపు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పథకం అమలు నుంచి ఇంటి మంజూరు, ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షించాల్సిన బాధ్యత శాఖపైనే ఉంది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్, వెబ్‌సైట్‌ను తెచ్చింది. కానీ వీటి వినియోగం నామమాత్రంగానే ఉంటోంది. క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల గుర్తింపు కోసం నిర్వహించిన సర్వే వివరాలన్నీ యాప్‌లో నమోదుకాకపోవడం, కొన్నిచోట్ల నమోదైన వాటి వివరాలు యాప్‌లో చూపడంలేదనే ఆరోపణలున్నాయి.
దీంతోనే సర్వే జాబితాలో తమ పేరు లేదా అని చాలామంది దరఖాస్తుదారులు అడిగే పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం జనవరి 21 నుంచి 24వరకు గ్రామసభల్లో మరోసారి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు స్వీకరించగా.. లక్షల్లో దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. గ్రామసభలు ముగిసి వారమైనా ఇప్పటికీ ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అధికారులు తేల్చడంలేదు. నిజమైన అర్హుల వివరాలను యాప్‌లో సరిగ్గా నమోదుచేయకపోవడంతోనే మళ్లీ దరఖాస్తులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనే చర్చ జరుగుతోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 80.54లక్షల దరఖాస్తులు రాగా వీటిలో ఇప్పటివరకు సుమారు 40-45లక్షల దరఖాస్తులనే పూర్తిస్థాయిలో పరిశీలించారు. మిగిలినవి పరిశీలనలోనే ఉన్నాయి. పరిశీలన కోసం 360 డిగ్రీల సాంకేతికతను వినియోగిస్తున్నట్టు సంబంధిత శాఖ చెబుతున్నా.. ఇప్పటికీ సగం దరఖాస్తు పరిశీలనే జరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇంకా మొదటి దఫా సర్వేనేసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద పథకాన్ని అమలు చేసే క్రమంలో 72వేల మందికి ఇంటి మంజూరు పత్రాలు ఇచ్చింది. వీటికి సంబంధించిన అన్ని వివరాలను ఇప్పటి కీ యాప్, వెబ్‌సైట్‌లో నమోదుచేయలేదని సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ పథకం విషయంలో అధికారుల తీరుతో ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా అధికారుల తీరుపై సంబంధిత శాఖ మంత్రి అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గృహ నిర్మాణ సంస్థలో నెలకొన్న గందరగోళ పరిస్థితికి ప్రభుత్వం పరిష్కారం చూపాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ మార్గదర్శకాలు..
జనవరి 21 నుంచి 24వరకు గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు గృహ నిర్మాణ సంస్థ ఎండీ మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇందులో మొదటి దశలో జరిగిన క్షేత్రస్థాయి పరిశీలనలో పలు తప్పులు జరిగినట్టు గుర్తించారని..వాటిని సరిచేయడానికి ఇప్పుడు ‘ఎడిట్’ అవకాశం కల్పించారు. వాటిలో ప్రధానంగా ప్రస్తుతం ఉంటున్న ఇల్లు, నివాసం ఎక్కడ ఉంటున్నారనే దాని గురించే ఉంది. చాలా మంది కిరాయి ఇంట్లో ఉంటున్నప్పటికీ ‘ఆర్‌సీసీ’ ఇంట్లో ఉంటున్నట్టు నమోదుచేయడంతోనే పథకం పొందేందుకు అర్హత ఉన్నా జాబితాలో పేరురాలేదని కొందరు వాపోతున్నారు. ఈ అంశంపై క్షేత్రస్థాయు నుంచి ఫిర్యాదులురావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అంతేకాకుండా ఇంటిని పొందేందుకు అర్హత ఉన్నా 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌లో అనర్హుల జాబితాలోకి వెళ్లినవారిని ఇప్పుడు అర్హత కలిగిన జాబితాలో చేర్చే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఫైలట్ ప్రాజెక్టు కింద 72వేల మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలను అందించగా.. కొన్నిచోట్ల అనర్హులున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతో అనర్హుల వివరాలు సేకరించాలని జిల్లాల అఽధికారులకు సూచించినట్టు తెలిసింది.
ఇవీ చదవండి:
ఏపీకి కేంద్రం వరాల జల్లు.. కేటాయింపులు అదిరిపోయాయి
కేంద్ర ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల పూర్తి వివరాలు ఇవే..
భారీగా తగ్గనున్న ఈ వస్తువుల ధరల
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి