Kaleshwaram Project: 22న కేసీఆర్ విచారణ..!
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:23 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతోపాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈనెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలని యోచిస్తోంది.
23, 24తేదీల్లో హరీశ్‌రావు, ఈటల కూడా
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ వైఫల్యాలతోపాటు ఆర్థిక అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఈనెల 22వ తేదీన మాజీ సీఎం కేసీఆర్‌ను విచారించాలని యోచిస్తోంది. ఈనెల 17న జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు రానున్నారు. 18న విచారణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. 20, 21వ తేదీల్లో.. అధికారుల క్రాస్‌ఎగ్జామినేషన్ చేయనున్నారు. 22వ తేదీన విచారణకు హాజరవ్వాల్సిందిగా మాజీ కేసీఆర్‌కు సమన్లు పంపనున్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ తాను నేరుగా రాలేనని, వర్చువల్‌గా హాజరవుతానని కోరినా.. కమిషన్ దానికి సమ్మతించే అవకాశాలున్నాయి. స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిఈ మాజీ ఎస్‌ఈ మురళీకృష్ణ అమెరికాలో ఉండగా.. ఆయనను కూడా వర్చువల్‌గా విచారించిన విషయం తెలిసిందే..! ఒకవేళ కేసీఆర్ అనారోగ్య సమస్యలను కారణంగా చెబుతూ.. లేఖను రాసినా, దాన్ని ప్రామాణికంగా చేసుకుని, విచారణను కొనసాగించే అవకాశాలున్నట్లు సమాచారం.
విద్యుత్తు విచారణ కమిషన్ కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి కమిషన్‌కు కేసీఆర్ రాసిన లేఖనే ఆయన అభిప్రాయంగా పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. కాగా.. జస్టిస్ ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో ఈనెల 23న మాజీ మంత్రి హరీశ్‌రావును, 24న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను విచారించే అవకాశాలున్నాయి. వీరిద్దరూ కూడా క్రాస్ ఎగ్జామినేషన్‌కు కచ్చితంగా హాజరు అవుతారని కమిషన్ భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని హెడ్‌వర్క్‌లతోపాటు ఇతర ప్రధాన పనులు జరిగినప్పుడు ఈటల బీఆర్‌ఎ్‌సలోనే ఉన్నారు. ఆయనను బీఆర్‌ఎస్ నుంచి పొమ్మనలేక పొగబెట్టారని, ఈటలను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని కమిషన్ భావిస్తోంది. ఈటల సంచలన విషయాలను వెల్లడించే అవకాశాలున్నట్లు రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కాగా.. 17న హైదరాబాద్ రానున్న జస్టిస్ పీసీఘోష్.. నెలరోజులపాటు ఇక్కడే బస చేస్తారని సమాచారం. ఫిబ్రవరి నెలాఖరులోగా ఆయన ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
మేడిగడ్డ ఇంజనీర్లపై చర్యలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయం తెలిసిందే..! ఆ బ్యారేజీ నిర్మాణం జరగకున్నా.. పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు, ఆ పత్రంపై కౌంటర్ సంతకం చేసిన ఎస్‌ఈ, ప్రస్తుత మహబూబ్‌నగర్ చీఫ్ ఇంజనీర్ బి.రమణారెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. కమిషన్ విచారణలో భాగంగా సర్టిఫికెట్లు జారీ చేసిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని ఇదివరకే ప్రశ్నించింది. దీంతో.. ఆ ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాయడం.. అధికారుల వివరాలన్నీ తీసుకుని.. అభియోగాల నమోదుచేస్తూ నీటిపారుదల శాఖ ఇటీవలే జీవోలను జారీ చేసింది. 17వ తేదీన హైదరాబాద్‌కు రానున్న కమిషన్‌కు అధికారులు ఈ పరిణామాలను నివేదించే అవకాశాలున్నాయి.