మానవహక్కుల సంఘం చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:59 AM
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు కమిషన్ సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి కిశోర్, శివాది ప్రవీణ కూడా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత షమీమ్ అక్తర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే.. 300 పాత కేసులు పరిశీలించామన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసులతోపాటు ఇక ముందు నమోదయ్యే కేసులను పరిష్కరించి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు న్యాయం చేయడానికి తమ సంఘం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్‌గా జస్టిస్ గుండా చంద్రయ్య పదవీ విరమణచేసిన తర్వాత ఆరేళ్లుగా ఈ పదవి ఖాళీగా ఉంది. అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా మానవహక్కుల సంఘం చైర్మన్, సభ్యులను నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది.