Share News

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:21 PM

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే మంచిర్యాలలో విద్యార్థులకు అనుకోని ఘటన ఎదురైంది. సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

10th Exam Delay: పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్
10th Exam Delay

మంచిర్యాల, మార్చి 21: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు (10th Exams) మొదలయ్యాయి. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యాయి. అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.


కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Harish Rao On Budget: ఇది గట్టి బడ్జెట్టా... ఒట్టి బడ్జెట్టా.. అసెంబ్లీలో సర్కార్‌పై హరీష్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 01:30 PM