Share News

ఏప్రిల్‌లో కాళేశ్వరం కమిషన్‌ నివేదిక!

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:59 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదిక ఏప్రిల్‌లో ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణ ప్రక్రియ తుది దశకు చేరింది.

ఏప్రిల్‌లో కాళేశ్వరం కమిషన్‌ నివేదిక!

  • తుది దశకు విచారణ.. 27 నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ నివేదిక ఏప్రిల్‌లో ప్రభుత్వానికి అందే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణ ప్రక్రియ తుది దశకు చేరింది. వాస్తవానికి ఈ దఫా కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్రధారులను విచారించాలని కమిషన్‌ తొలుత యోచించింది. అయితే విచారణలో పలువురు కీలక ఇంజనీరింగ్‌ అధికారులు వాస్తవ విరుద్ధంగా సమాచారం ఇచ్చినట్లు గుర్తించింది.


రికార్డుల్లో వివరాలు ఒకలా ఉంటే... వీరంతా మరోలా సమాచారంఇచ్చారని కమిషన్‌ భావిస్తోంది. రికార్డులను పరిశీలించే క్రమంలో వీరి పాత్రపై మరిన్ని ఆధారాలు లభించినట్లు సమాచారం. దాంతో కీలక అధికారులను మళ్లీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కమిషన్‌ పిలవనుంది. 27 నుంచి తదుపరి విచారణ జరపనుంది. తొలిరోజు ఇద్దరు మాజీ అధికారులు సహా ఒక కీలక అధికారిని విచారించే అవకాశాలున్నాయి.

Updated Date - Feb 25 , 2025 | 03:59 AM