Share News

Kishan Reddy: ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:07 AM

తెలంగాణలో కాంగ్రె్‌సది ప్రజా ప్రభుత్వం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు.

Kishan Reddy: ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం

  • మార్పు కోసం కాంగ్రెస్‌ అన్నారు.. ఏడాదిలో ఎలాంటి మార్పూ లేదు

  • గతంలో కేసీఆర్‌ కుటుంబం దోచేస్తే.. ఇప్పుడు మంత్రులు దోచుకుంటున్నారు

  • రైతు భరోసాకు దరఖాస్తులు ఎందుకు: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రె్‌సది ప్రజా ప్రభుత్వం కాదని.. ప్రజలను మోసం చేసే ప్రభుత్వం అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్పు కోసం కాంగ్రెస్‌ రావాలని ఎన్నికల ముందు నాయకులు ప్రచారం చేశారని, కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రాష్ట్రంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్‌ కుటుంబం మాత్రమే దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్‌ మంత్రులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇది చేతకాని దద్దమ్మ ప్రభుత్వం అని అన్నారు. మాటలు, కోతల ప్రభుత్వం అని ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రుణమాఫీ అరకొరగా చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నా, రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతున్నారంటే ప్రజలను మభ్యపెట్టేందుకేనని అన్నారు.


రుణమాఫీ లాగే రైతుభరోసాకు కోతలు పెడతారన్నారు. రాష్ట్రంలో ఫసల్‌బీమా అడ్రస్‌ లేదని, గతంలో కేసీఆర్‌ పదేళ్లపాటు ఇలాగే ఫసల్‌ బీమా లేకుండా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, ఇప్పుడు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు మూడు పంటలు పూర్తయినా రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్నికల సమయంలో పది రకాల పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పి కేవలం వరి పంటకే బోనస్‌ ఇచ్చారన్నారు. అది కూడా అరకొరగా సన్నబియ్యానికే అని సన్నాయి నొక్కులు నొక్కారని కిషన్‌రెడ్డి విమర్శించారు. అధికారంలోకి రాక ముందు ఓడమల్లన్న.. అధికారంలోకి వచ్చాక బోడి మల్లన్న అన్న చందంగా కాంగ్రెస్‌ నాయకుల తీరు ఉందన్నారు. రాష్ట్రంలో పండించే ధాన్యం అంతా కేంద్రం మద్దతు ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ జనవరి రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపి కలెక్టర్లకు వినతి పత్రాలు అందిస్తామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

Updated Date - Jan 04 , 2025 | 04:07 AM