Share News

KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ABN , Publish Date - Jan 05 , 2025 | 04:49 AM

‘‘పది, పదిహేను మంది ఎంపీలతో నితీ్‌షకుమార్‌, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. వారిలాగే మనకూ ఒక రోజు వస్తుంది. తప్పకుండా కేంద్రంలో చక్రం తిప్పుతాం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చిన్న, చిన్న పొరపాట్ల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని గుర్తు చేశారు.

KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

  • చంద్రబాబు, నితీశ్‌లా మనకూ ఒక రోజు వస్తది

  • ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరవుతా

  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సిరిసిల్ల, జనవరి 4 (ఆంరఽధజ్యోతి): ‘‘పది, పదిహేను మంది ఎంపీలతో నితీ్‌షకుమార్‌, చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. వారిలాగే మనకూ ఒక రోజు వస్తుంది. తప్పకుండా కేంద్రంలో చక్రం తిప్పుతాం’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. చిన్న, చిన్న పొరపాట్ల వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని గుర్తు చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ కారణంతోనే మంచి వాళ్లను ప్రజలు కాదనుకుని, అటు బీజేపీకి, ఇటు కాంగ్రె్‌సకు ఎనిమిదేసి చొప్పున సీట్లు ఇచ్చారన్నారు. సంవత్సరం గడిచినా కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు గుండుసున్నా అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చి నాలుగు వందల రోజులు గడిచినా.. ఆరు గ్యారెంటీలకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు. సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు రైతు భరోసాకు రైతుల నుంచి ప్రమాణ పత్రాలు అడగడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు రైతు బంధు కోసం ఎవరికీ దండం పెట్టలేదని, దరఖాస్తు ఇవ్వలేదని గుర్తు చేశారు.


ఉద్యోగులకు, ఐటీ కట్టేటోళ్లకు భరోసా కట్‌ చేస్తానని చెప్పడం సరికాదన్నారు. సీఎం అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదు.. కటింగ్‌ మాస్టర్‌ అన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. మొహం బాగ లేక అద్దం పగులగొట్టినట్లు.. పరిపాలన చేతకాక రాష్ట్ర పరిస్థితి బాగా లేదని చెబుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ఆరు గ్యారెంటీలపై ప్రతి నెలా ఒక్కో కార్యక్రమం పెట్టుకుందామని, కాం గ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా గులాబీ దండుదేనని అన్నారు. న్యాయ నిపుణుల సూచన మేరకు ఫార్ములా-ఈ కేసులో విచారణకు హాజరవుతానని తెలిపారు. ఏసీబీ, ఈడీ పెట్టినవి తప్పుడు కేసులేనని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా తనపై ఆరు కేసులు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ గెలిస్తే సీఎం రేసులో కేటీఆర్‌, కవిత ఉంటారంటూ జరుగుతున్న ప్రచారం తప్పని, కొందరు బుద్ధి తక్కువవాళ్లు చేసే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని, కచ్చితంగా అవుతారని పేర్కొన్నారు. మేడిగడ్డ కొట్టుకుపోవాలని, కేసీఆర్‌కు చెడ్డపేరు రావాలని కాంగ్రెస్‌ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. సంవత్సరం గడిచినా బ్యారేజీకి ఎందుకు మరమ్మతు చేయడం లేదని, బ్యారేజీని వీళ్లే ఏదో చేశారని తనకు అనుమానం ఉందని అన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 04:49 AM