Share News

KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్‌ నైజం

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:18 AM

తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ నయా మోసం చేసిందని, నమ్మక ద్రోహం ఆ పార్టీ నైజమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

KTR: నమ్మక ద్రోహం కాంగ్రెస్‌ నైజం

  • రైతులను దగా చేసిన రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు ముక్కు నేలకు రాయాలి

  • మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా?

  • కేటీఆర్‌ విమర్శలు.. నేడు రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్‌ నిరసన

హైదరాబాద్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతులను కాంగ్రెస్‌ నయా మోసం చేసిందని, నమ్మక ద్రోహం ఆ పార్టీ నైజమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ప్రధాన హామీని నెరవేర్చకుండా రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలన్నారు. డిక్లరేషన్ల పేరుతో నమ్మించి నయవంచన చేసిన రాహుల్‌ గాంధీ 70 లక్షలమంది రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్‌ తప్పుడు హామీలిచ్చిందని, ఆ పార్టీని తెలంగాణ రైతాంగం ఎన్నటికీ క్షమించదన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సోనియాగాంధీ చెబితేనే తాను మాటిస్తున్నానని రేవంత్‌ రెడ్డి ఆనాడు అన్నారని, రైతు భరోసా గురించి ఇప్పుడు ఆయన చెబుతున్న మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు.


రైతులకు సంబంధించిన పలు హామీలను వరంగల్‌ డిక్లరేషన్‌ పేరుతో రాహుల్‌ గాంధీతో చెప్పించారని, అధికారంలోకి వచ్చాక ఆ పథకాల అమలుకే గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం రైతుబంధు కింద ఇచ్చిన పదివేలనే బిచ్చమన్న రేవంత్‌.. ఇప్పుడు చేస్తున్నదేమిటని నిలదీశారు. పెట్టుబడి సాయాన్ని రూ.2 వేలు పెంచడమంటే.. ఆయన దృష్టిలో ముష్టి వేస్తున్నట్లా? ఇచ్చినమాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా? రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. వెంటనే తాను వస్తాన్న రాహుల్‌ గాంఽధీ.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పరిస్థితులు బాగుండేవని సీఎం పదవిలో కూర్చొని రేవంత్‌రెడ్డి తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంలోనే ధనిక రాష్ట్రం తెలంగాణ అని ప్రతిపక్షంలో ఉన్నపుడు పేర్కొన్న రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పులపాలైందని ప్రచారం చేస్తున్నారన్నారు. బాగోలేనిది రాష్ట్ర ఆర్థికపరిస్థితి కాదని.. ఆయన మానసిక పరిస్థితి అని అన్నారు.


అప్పు తెచ్చిన డబ్బును ఏం చేశారు?

ఇబ్బందికర పరిస్థితులను సరిదిద్దాల్సిన స్థానంలో కూర్చొని రాష్ట్రం గురించి సీఎం రేవంత్‌ రెడ్డి తక్కువగా మాట్లాడటం సరికాదని కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇంజన్‌గా ఉన్న హైదరాబాద్‌లో హైడ్రా, మూసీ ప్రాజెక్టు కారణంగా రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని ఆరోపించారు. కేసీఆర్‌ అప్పు చేస్తే.. ఆ డబ్బులను ప్రజలకు పంచారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలో రూ.1.38 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీకి మూటలు పంపించారా? అని నిలదీశారు. రైతులందరికీ రైతు భరోసా పథకం వర్తింపచేసేవరకు కాంగ్రెస్‌ సర్కార్‌పై పోరాటం చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులకు మద్దతుగా నిరసనలు చేపట్టనున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు.కాగా రాష్ట్రవ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవడం తగదని ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌ వేదికగా అన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 04:18 AM