అప్సర హత్య కేసులో సాయికృష్ణకు జీవిత ఖైదు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:29 AM
నటి కురుగంటి అప్సర హత్య కేసులో నిందితుడు ఆలయ పూజారి వెంకట సూర్య సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది.

రూ.10 లక్షల జరిమానా.. అందులో 9.75 లక్షలు మృతురాలి కుటుంబానికి..
సాక్ష్యాలను తారుమారు చేయాలని యత్నించినందుకు మరో ఏడేళ్ల జైలు
రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు
2023 జూన్ 3న పథకం ప్రకారం అప్సరను చంపిన పూజారి సాయికృష్ణ
ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం
పెళ్లికి అప్సర ఒత్తిడి చేయడంతో హత్య
రంగారెడ్డి కోర్టు/శంషాబాద్ రూరల్, మార్చి 26(ఆంధ్రజ్యోతి): నటి కురుగంటి అప్సర హత్య కేసులో నిందితుడు ఆలయ పూజారి వెంకట సూర్య సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రేమిస్తున్నానంటూ అప్సరను నమ్మించిన సాయికృష్ణ... ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పథకం ప్రకారం ఆమెను హత్య చేసి.. మృతదేహాన్ని మ్యాన్‌హోల్ పడేసి సిమెంట్ పోశాడు. పీపీ వోడ్యారపు రవికుమార్ కథనం ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన సాయికృష్ణ తన భార్య, కూతురితో కలిసి సరూర్‌నగర్ వెంకటేశ్వర కాలనీలో నివసించేవాడు. స్థానికంగా ఉన్న బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. చెన్నైకి చెందిన అప్సర తన తల్లితో కలిసి గుడి సమీపంలో నివసించేది. పలు చిత్రాలు, సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అప్సర అప్పుడప్పుడు గుడికి వెళుతుండేది. ఈ క్రమంలో సాయికృష్ణ, అప్సర మధ్య పరిచయం ఏర్పడింది.
అది ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అప్సర... సాయికృష్ణపై ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను వదిలించుకోవాలని సాయికృష్ణ పథకం పన్నాడు. దాని ప్రకారం 2023 జూన్ 3న కోయంబత్తూరు వెళదామని చెప్పి ఆమెను కారులో శంషాబాద్ తీసుకుని వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలం నర్కుడలో గోశాల సమీపంలోని నవరంగ్ వెంచర్‌లోకి తీసుకెళ్లి ఆమె ముఖంపైన కారు కవర్ చుట్టి ఊపిరాడకుండా చేయగా ఆమె ప్రతిఘటించింది. సాయికృష్ణ ఆమె ముఖంపై రాయితో బాదడంతో మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని కవర్‌లో చుట్టి కారు డిక్కీలో పెట్టాడు. అలాగే ఇంటికొచ్చి రెండు రోజుల పాటు కారును పార్కింగ్ ప్రదేశంలో ఉంచాడు. తర్వాత సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వెనక ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్‌లో వేసి ఎర్రమట్టితో కప్పెట్టి సిమెంట్ వేశాడు. జూన్ 5న అప్సర స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని ఆమె తల్లిని నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడంలేదని చెప్పుకొచ్చాడు.
అప్సర తల్లితో కలిసి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు సాయికృష్ణ మాట్లాడే తీరుతో అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రంగారెడ్డి జిల్లా 11వ అదనపు సెషన్స్ జడ్జి వై.జయప్రసాద్ నిందితుడు సాయికృష్ణకు జీవిత ఖైదుతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించారు. అందులో రూ.9.75 లక్షలు మృతురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా చెల్లించాలని, రూ.25 వేలు ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశించారు. జమ చేయలేని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించినందుకు మరో ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. ఇది చెల్లించకపోతే మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..
GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు
Read Latest Telangana News And Telugu News