Share News

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు మళ్లీ మళ్లీ!

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:06 AM

బోడుప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి 2020లో తన ఇంటి స్థలం క్రమబద్ధీకరణకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో దరఖాస్తు చేసుకున్నాడు.

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు మళ్లీ మళ్లీ!

గతంలో చెల్లించినా.. సిబ్బంది నుంచి ఫోన్లు

  • నిర్మాణ అనుమతుల జారీ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించిన కొందరు

  • అయినా ఇప్పుడు ఫీ ఇంటిమేషన్‌ లెటర్లు

  • ఐదు రోజులే గడువు ఉండడంతో ఆందోళన

  • పురపాలక శాఖ నిర్లక్ష్య వైఖరి వల్లే!

హైదరాబాద్‌ సిటీ, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బోడుప్పల్‌కు చెందిన ఓ వ్యక్తి 2020లో తన ఇంటి స్థలం క్రమబద్ధీకరణకు లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎ్‌స)లో దరఖాస్తు చేసుకున్నాడు. 2022లో భవన నిర్మాణ అనుమతి తీసుకున్న ఆయన.. అదే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుముతో కలిపి పర్మిషన్‌ ఫీజు చెల్లించాడు. ఇటీవల ఆయనకు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలంటూ సిబ్బంది ఫోన్‌ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓ వ్యక్తి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో రెండేళ్ల క్రితం నిర్మాణ అనుమతులు తీసుకున్నాడు. భవన నిర్మాణం పూర్తయి.. గృహప్రవేశం కూడా జరిగింది. ఆన్‌లైన్‌లో ఆయన ఎల్‌ఆర్‌ఎస్‌ స్టేటస్‌ తనిఖీ చేయగా.. రూ.1.08 లక్షల రుసుమునకు సంబంధించి ఫీ ఇంటిమేషన్‌ లెటర్‌ జనరేట్‌ అయింది. శివారు మునిసిపాలిటీలోని ఓ వ్యక్తి నెల రోజుల క్రితం భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నాడు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితి జీహెచ్‌ఎంసీతోపాటు పలు మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్లలో నెలకొంది. చాలా మంది భవన నిర్మాణ అనుమతులు తీసుకున్న సమయంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము కూడా చెల్లించినా.. సిబ్బంది మళ్లీ ఫోన్లు చేస్తున్నారు. దీంతో ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకాక దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనే చెల్లించాం కదా.. మళ్లీ ఎందుకు? అంటే కొన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సమాధానం చెప్పేవారు కరువయ్యారు. మరో ఐదు రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ఫీజు చెల్లించాలా? వద్దా? అనేది తెలియక అయోమయానికి గురవుతున్నారు. క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలని హడావుడిగా మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ.. సాంకేతిక అంశాలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.


గతంలోనే రుసుము చెల్లించినా..

ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని 2020లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి జీహెచ్‌ఎంసీ పరిధిలో 1.06 లక్షల దరఖాస్తులు రాగా, శివారు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో 6లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కోర్టు కేసులు, ఇతర కారణాలతో దరఖాస్తుల పరిశీలన దాదాపు ఐదేళ్లు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ప్లాట్ల యజమానులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు.. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్నవారి నుంచి అదే సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము కూడా వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసిన వారికి 2020 సబ్‌ రిజిస్ర్టార్‌ విలువ ప్రకారం క్రమబద్ధీకరణ రుసుము నిర్ధారించారు. ఎల్‌ఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేయని, అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లకు ప్రస్తుత సబ్‌ రిజిస్ర్టార్‌ విలువ ప్రకారం రుసుము నిర్ధారించారు. కాగా, ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీలోని దాదాపు 40 శాతం మంది దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించి భవన నిర్మాణ అనుమతులు పొందినట్లు పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు చెబుతున్నాయి. శివార్లలోని బోడుప్పల్‌, పీర్జాదిగూడ, జవహర్‌నగర్‌, నిజాంపేట, తుర్కయాంజాల్‌ తదితర మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ ఇదే విధంగా అనుమతులు తీసుకున్నారు. అయితే వీరిలో చాలా మందికి ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించాలంటూ ఫోన్లు వస్తున్నాయి.


అప్‌డేట్‌ చేయకపోవడం వల్లే..

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి జోనల్‌ కార్యాలయాల్లో జీహెచ్‌ఎంసీ హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసింది. అయితే అక్కడి సిబ్బంది మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. గతంలోనే ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించినా.. ఇటీవల ఫోన్‌ చేశారని, తాము మళ్లీ ఫీజు చెల్లించాలా? గతంలో చెల్లించిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తారా? అని అడిగితే తెలియదని సమాధానమిస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల అలా జరిగి ఉండవచ్చని శివార్లలోని కొన్ని కార్పొరేషన్ల సిబ్బంది చెబుతున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో ఎంత మంది నిర్ణీత రుసుము చెల్లించి ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు తీసుకున్నారనే వివరాలను అప్‌డేట్‌ చేయకుండా పాత డేటా ఆధారంగా ఫీజు ఇంటిమేషన్‌ లెటర్లు జనరేట్‌ చేసినట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగానే సిబ్బంది దరఖాస్తుదారులకు ఫోన్‌ చేస్తున్నారు. కానీ, దరఖాస్తుదారుల సందేహాలకు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. కొన్ని దరఖాస్తులకు జీరో రుసుము, ఒకే ఏరియాలో ఒకే విస్తీర్ణం, ఒకే ఏడాది రిజిస్ర్టేషన్‌ జరిగిన ప్లాట్లకు వేర్వేరుగా రుసుము నిర్ధారణ.. షార్ట్‌ ఫాల్స్‌ అప్‌లోడ్‌ చేయడంలో సమస్యలతో గందరగోళ పరిస్థితి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 02:06 AM