మన ఊరు-మన బడి పెద్ద స్కామ్:అక్బరుద్దీన్
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:48 AM
బీఆర్‌ఎస్ ప్రభుత్వం "మన ఊరు మన బడి" కార్యక్రమాన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణించిన ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉండగా, విద్యా వ్యవస్థకు తగిన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో ‘మన ఊరు మన బడి’ అనేక కార్యక్రమం అతి పెద్ద కుంభకోణమని ఐఎంఐం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఆరోపించారు. బడ్జెట్ పద్దుల సందర్భంగా విద్య అంశంపై ఆయన మాట్లాడుతూ.. గత సర్కారు హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ‘మన ఊరు మన బడి’ అనేదే అతి పెద్ద స్కామ్ అని అన్నారు. మిగతావన్నీ చాలా చిన్నచిన్న కుంభకోణాలని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ సర్కారు సమగ్రవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం తగదన్నారు. 4,823 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదోడ్లు లేవని, 2 వేలకుపైగా బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. తగినంత నిధులు కేటాయించకుండా విద్యా వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.