Share News

BRS MLA Koushik Reddy: మళ్లీ నోటీసులు.. విచారణకు రాలేనన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

ABN , Publish Date - Jan 15 , 2025 | 06:39 PM

BRS MLA Koushik Reddy: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ డబ్బులకు అమ్ముడు పోయిన ఓ బ్రోకర్ ఒక దొంగ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ కార్యకర్తలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు.

BRS MLA Koushik Reddy: మళ్లీ నోటీసులు.. విచారణకు రాలేనన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
BRS MLA Koushik Reddy

హైదరాబాద్, జనవరి 15: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి మసాబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం విచారణకు హాజర కావాలని ఆ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. అయితే ఈ నోటీసులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్‌లో బుధవారం స్పందించారు. తాను గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీన అంటే.. శుక్రవారం విచారణకు హాజరవుతానని మాసాబ్ ట్యాంక్ పోలీసులకు ఆయన వివరణ ఇచ్చారు.

గతంలో బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ విధులను అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు కౌశిక్ రెడ్డి పాల్పడ్డారు. దీంతో ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసులో దర్యాప్తు అధికారిగా మసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు. అందులోభాగంగా విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Also Read: ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు


మరోవైపు జనవరి 12వ తేదీ.. ఆదివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పాల్గొన్నారు. ఆ క్రమంలో సంజయ్‌ను ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్ల కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్తా స్వల్ప ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఎమ్మెల్యే సంజయ్‌ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్‌రెడ్డి దుర్భాషలాడారని ఆ ఫిర్యాదులో సంజయ్‌ స్పష్టం చేశారు. తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్‌ రెడ్డి.. తనను అడ్డుకున్నారని చెప్పారు. దీంతో కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఎమ్మెల్యే సంజయ్ కోరారు.

Also Read: మీ ఆవేదన, ఆక్రోశం దేని కోసం


కరీంనగర్ ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏలు కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కేసులు నమోదు చేశారు. మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో ఆయనపై 126 (2),115(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.దీంతో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

Also Read: పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్‌.. చివరకు భలే దొరికాడు


ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డి అరెస్ట్‌కు ఉపక్రమించారు. అదీకాక గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‍గా ఉంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆయన సవాళ్లు విసురుతోన్నారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో వివాదం చోటు చేసుకుంది. దీంతో ఆయన సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు 132, 351 (2) బీఎన్ఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే ఈ ఏడాది జనవరి 10వ తేదీన 'గేమ్ చేంజర్' చిత్రం విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవి సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్‌ త్రీ టౌన్‌ పీఎస్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదయింది.

Also Read: మరికొద్ది రోజుల్లో బడ్జెట్.. వీటిని గమనించండి


ఇక బుధవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ డబ్బులకు అమ్ముడు పోయిన ఓ బ్రోకర్ ఒక దొంగ అంటూ మండిపడ్డారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీ కార్యకర్తలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలంటూ గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారన్నారు. గతంలో జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో ఇదే రేవంత్ రెడ్డి మైకు గుంజుకున్నాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ ఇద్దరికి సిగ్గులేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఆయన క్యాబినెట్‌లో మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉన్నారని చెప్పారు.

For Telangana News And Telugu News

Updated Date - Jan 15 , 2025 | 06:45 PM