TG News: పేలిన రియాక్టర్..ఒకరి మృతి.. పరుగులు తీసిన కార్మికులు
ABN , Publish Date - Jan 04 , 2025 | 10:30 AM
Telangana: భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం వెంటనే ఎమర్జెన్సీ సైరన్ మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది.
యాదాద్రి, జనవరి 4: జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో భారీ పేలుడు సంభవించింది. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్‌లో కంపెనీలో రియాక్టర్ (Reactor exploded) పేలింది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో భయంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలిన వెంటనే అలెర్ట్ అయిన కంపెనీ యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌ను మోగించింది. ప్రమాదవశాత్తు పేలుడు పదార్ధాలు బ్లాస్ట్ అవడంతో భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా... ఏడు మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. ఈరోజు ఉదయం ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ డిటోనేటర్ ప్లాంట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మొత్తం ఎనిమిది మంది కార్మకులకు తీవ్ర గాయాలయ్యాయి.
గాయపడిన వారిని భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ కార్మికుడు కనకయ్య మృతి చెందాడు. మరో కార్మికుడు మొగిలిపాక ప్రకాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గతంలోనూ ఈ కంపెనీలో జరిగిన పేలుడు ధాటికి ఓ కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా పెద్దఎత్తున పేలుడు సంభవించింది. దీంతో కార్మికులు ప్రాణభయంతో కంపెనీ నుంచి బయటకు పరుగులు తీశారు.
కఠిన చర్యలు తప్పవు: బీర్ల ఐలయ్య
యాదాద్రి : పేలుడు జరిగిన ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ లిమిటెడ్ కంపెనీని పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలో పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. కార్మికుల పట్ల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గతంలోనూ కార్మికుల సేఫ్టీపై కంపెనీకి సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. కార్మికుల బాగోగులు పట్టించుకోకుండా ధనార్జనే ధ్యేయంగా కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇంత పెద్ద కంపెనీలో ప్రమాదం జరిగితే కనీసం కంపెనీకి అంబులెన్స్ కూడా లేదని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
నాలుగో రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు..
అత్యవసర ల్యాండింగైన ఇండిగో విమానం.. విషయం ఇదే..
Read Latest Telangana News And Telugu News