Vasant Panchami.. బాసరలో కిటకిట లాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
ABN , Publish Date - Feb 03 , 2025 | 07:05 AM
నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపిస్తున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో 3 గంటల నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వస్తోంది.

నిర్మల్ జిల్లా: వసంత పంచమి (Vasant Panchami) పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ బాసర సరస్వతి ఆలయానికి ( Basara Saraswati Temple) భక్తులు (Devotees) పోటెత్తారు. జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. సోమవారం తెల్లవారు జాము 2 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిలుచున్నారు. క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు కిటకిట లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మంత్రుల పర్యటనలు రద్దయ్యాయి. ప్రభుత్వం తరపున అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆలయంలో కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పర్యవేక్షిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు
కాగా వసంత పంచమి వేళ నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు కూడా జరిపించుకున్నారు. పూజల కోసం భక్తులు క్యూలైన్లలో మూడు నుంచి 5 గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు కాలినడకన బాసర చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఏర్పాట్లు సరిపోకపోవడంతో అడుగడుగునా ఇబ్బందులు తలెత్తాయి. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తగిన స్థాయిలో ఏర్పా టు చేయకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. సమాచార బోర్డులు, సహాయ కేంద్రాలు, హెల్ప్‌డెస్క్‌లు వంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఏ క్యూలైన్ ఎటు వైపు ఉందో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియక భక్తుల్లో గందరగోళం నెలకొంది.
వసంత పంచమి పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటున్న భక్తులు, ముఖ్యంగా చిన్నపిల్లలు, అక్షరాభ్యాస పూజలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. అక్షరాభ్యాస పూజలకు భక్తులు సుమారు 2 గంటల వరకు వరుసల్లో నిలబడాల్సి వచ్చింది. భక్తులకు సదుపాయాలు సరిపడా లేకపోవడంతో అనేకమంది అసంతృప్తి వ్యక్తం చేశారు. .
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News