CM Revanth Reddy: సొల్లు మాటలు వద్దు.. ఆధారాలతో చూపించండి
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:55 PM
CM Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని.. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అని కోరారు.

నిజామాబాద్, ఫిబ్రవరి 24: నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రసంగించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్య వారధిగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పర్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరిస్తే కేసీఆర్ (Former CM KCR) ఫామ్ హౌస్‌లో పడుకున్నారని.. బీఆర్‌ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటు వేయాలని చెబుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించవద్దని ప్రచారం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడని బీఆర్‌ఎస్ రాజకీయ పార్టీఏ కాదన్నారు. పోటీకి నిలబడని వారు కాంగ్రెస్‌ను ఎలా ప్రశ్నిస్తారని నిలదీశారు. తమకు పరిపాలించే అవకాశం తక్కువగా వచ్చిందని.. అయినా 55,163 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్ వన్ పోస్టు ఇచ్చామన్నారు. వరంగల్‌కు చెందిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారని.. పదేళ్ల పాటు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పారని విమర్శించారు. ‘‘నేను చెప్పింది నిజమైతేనే మాకు ఓటు వేయండి’’ అని కోరారు. నిజామాబాద్ రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పంటలు పండిస్తారన్నారు. రైతు రుణమాఫీ చేశామని.. రైతు భరోసా ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ సర్కారు చేసిన అప్పుకు ఇంత వరకు 75 వేల కోట్ల వడ్డీ కట్టామన్నారు. తాను సీఎం అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల ఒకటో తేదీన జీతం ఇస్తున్నామన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ 8 వేల కోట్లు బకాయి పెట్టారని.. రాబోయే రోజుల్లో నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లిస్తామని ప్రకటించారు.
Vamshi Case: వంశీ కేసులో విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు
‘‘బండి సంజయ్ బడా బీసీ అంటున్నాడు. మీరు పదేళ్ళలో కులగణన ఎందుకు చేయలేదు. మీకోసం లెక్కలు తేల్చి నేను కొట్లాడుతున్నా. బలహీన వర్గాల లెక్కలు తప్పైతే ఆధారాలతో చూపండి. సొల్లు మాటలు వద్దు. గుజరాత్‌లో 29 కులాల ముస్లింలు బీసీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. మాదిగ ఉప కులాల వర్గీకరణ చేసి చట్టసభల్లో ఆమోదించాం. మోదీ, కృష్ణ మాదిగను కౌగిలించుకున్నాడు కానీ వర్గీకరణ చేయలేదు. జర్నలిస్టుల సమస్యలు పట్టించుకుని పరిష్కరిస్తున్నాం. టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అరెస్ట్ కాకుండా అడ్డుకుంటుంది బండి సంజయ్, కిషన్ రెడ్డి. ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఎప్పుడు విదేశాల నుంచి రప్పిస్తారు. బండి సంజయ్ శాఖ పనే కదా ఇది. వారు రాగానే బొక్కలో వేస్తాం. వారితో చీకటి ఒప్పందాలు చేసుకుని కాపాడుతున్నారు. కాగితాలు ఇచ్చి డ్రామాలు చేస్తున్నారు. ఉన్న ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేని బోడి పార్టీ ఉప ఎన్నికల్లో తడాఖా చూపిస్తారట. హైదరాబాద్ మెట్రోకు అనుమతి రాకుండా కేంద్రంలో కిషన్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. మూసీ ప్రక్షాళనకు నిధులు రాకుండా అడ్డుకున్నారు. మాకు క్రెడిట్ వస్తదని తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. పట్టభద్రులు అండగా నిలబడండి.. కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పషట్ం చేశారు.
ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు: మహేష్
నిజామాబాద్: దూరదృష్టి ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ ధైర్యంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. 9 మాసాల్లో 56 వేల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు. భగవంతుడు అందరికీ ఉన్నారన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తెచ్చింది సున్నా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. పట్టభద్రులు ఆలోచించి ఓట్లు వేయాలని మహేష్ కుమార్ కోరారు.
ఇవి కూడా చదవండి...
ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి
Read Latest Telangana News And Telugu News