Share News

Omega Hospital: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:37 AM

క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ముప్పును ముందే గుర్తిస్తే.. వాటిని రాకుండా అడ్డుకోవచ్చని ఒమేగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్‌ మోహన్‌ వంశీ అన్నారు.

Omega Hospital: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు

  • ‘ఉమ్ము’ పరీక్షతో ప్రతి వ్యక్తికీ ప్రత్యేక చికిత్స

  • ‘ఒమేగా’ వ్యవస్థాపకుడు డాక్టర్‌ మోహన్‌ వంశీ

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే ముప్పును ముందే గుర్తిస్తే.. వాటిని రాకుండా అడ్డుకోవచ్చని ఒమేగా ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్‌ మోహన్‌ వంశీ అన్నారు. వ్యాధుల ముప్పును ముందుగా గుర్తిస్తే సులభంగా చికిత్స చేయొచ్చని చెప్పారు. గచ్చిబౌలిలోని ఒమేగా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా ఒమేగా ఆస్పత్రిలో ‘దీర్ఘాయుషు చికిత్సల విభాగం (లాంగ్విటీ లాంజ్‌)’ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తాము అందుబాటులోకి తెస్తున్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఉమ్ము పరీక్ష చేస్తామన్నారు. ఈ పరీక్ష చేస్తే 70 రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలను ముందుగానే గుర్తించవచ్చని చెప్పారు. క్యాన్సర్‌ అనేది చాపకింద నీరులా వ్యాపించి, ప్రాణాలు తీస్తుందని.. దేశంలో ఏటా 50 వేల కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని వివరించారు.


ఇతర దేశాలతో పోలిస్తేమన దేశంలో కేసుల గుర్తింపు, నమోదులో జాప్యం జరుగుతోందని వంశీ చెప్పారు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే సులభంగా చికిత్స చేయవచ్చన్నారు. క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్న సమయంలో డీఎన్‌ఏలో కొన్ని ఎంజైములు చేరి మార్పులు జరుగుతాయని, వాటిని బట్టి ముందుగానే వ్యాధిని గుర్తించవచ్చని తెలిపారు. అంతేకాకుండా గుండె పోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలను ముందుగా గుర్తించి, చికిత్సతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని చెప్పారు. జన్యు పరీక్షల ద్వారా డీఎన్‌ఏ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసి, సులభంగా చికిత్స అందించవచ్చని తెలిపారు. ఆరోగ్య సేవల్లో ఇది కీలక పరిణామమన్నారు. ఇక క్యాన్సర్‌కు అందించే కీమోథెరపీ చికిత్సతో ఒక రోగికి ఎక్కువ ప్రయోజనం కలిగితే మరో రోగికి తక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు. వారం రోజుల్లో తాము లాంగ్విటీ లాంజ్‌ సేవలను ప్రారంభిస్తామన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 04:37 AM