Share News

Komatireddy Venkata Reddy: ఓఆర్‌ఆర్‌ని అమ్ముకున్నోళ్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌పై విమర్శలా

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:40 AM

రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఓఆర్‌ఆర్‌ అమ్మకంపై బీఆర్‌ఎస్‌ సర్కారును ఆక్షేపించారు. గత ప్రభుత్వం చేయని పనులను 15 నెలల్లో చేసినట్లు పేర్కొన్న ఆయన, ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ, పర్యావరణ అనుమతుల విషయంలో వివరణ ఇచ్చారు

Komatireddy Venkata Reddy: ఓఆర్‌ఆర్‌ని అమ్ముకున్నోళ్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌పై విమర్శలా

  • ఆ అర్హత బీఆర్‌ఎస్‌కు లేదు: కోమటిరెడ్డి

  • ఆర్‌ఆర్‌ఆర్‌కు 2017లోనే జాతీయ హైవే నంబరు వచ్చిందని వెల్లడి

  • ఇప్పటిదాకా రాలేదన్న ప్రశాంత్‌రెడ్డి

  • రేషన్‌ షాపుల్లోనూ మద్యం అమ్మిన చరిత్ర మీది

  • బీఆర్‌ఎస్‌ నేతలపై శ్రీధర్‌బాబు ఆగ్రహం

  • ‘మద్యంతో అదనపు ఆదాయం’ లక్ష్యం కాదు: జూపల్లి

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను కాంగ్రెస్‌ నిర్మిస్తే బీఆర్‌ఎస్‌ సర్కారు గత ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అమ్మేసుకుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నోళ్లకు ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయనిది తాము 15 నెలల్లో చేసి చూపించామని చెప్పారు. మంగళవారం శాసనసభలో ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు రోడ్లు, భవనాల పద్దులపై చర్చలో ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి దీటుగా బదులిచ్చారు. సమావేశాలు ప్రారంభం కాగానే మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వివిధ శాఖల పద్దులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాలు, ఎక్సైజ్‌ శాఖపై అధికార, విపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. సరిపడా నిధులు కేటాయించకుండా ఆర్‌ఆర్‌ఆర్‌కు భూములు ఎలా సేకరిస్తారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. ఆర్‌ఆర్‌ఆర్‌కు పర్యావరణ అనుమతి లేదని, జాతీయ హైవే నంబరు కూడా లేనందువల్లే భూసేకరణ చేయలేదని చెప్పారు.


మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల్పించుకొని.. ఆర్‌ఆర్‌ఆర్‌కు 2017లోనే ఎన్‌హెచ్‌-167 నంబరు ఇచ్చారన్నారు. 88 శాతం మంది రైతుల నుంచి భూసేకరణకు సమ్మతి తీసుకున్నామని, రెండు నెలల్లోపు ఆర్‌ఆర్‌ఆర్‌కు అన్ని అనుమతులు వస్తాయని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో భూసేకరణపై నోటిఫికేషన్‌ ఒక్కటే ఇచ్చారని, గజ్వేల్‌ (కేసీఆర్‌), సిరిసిల్ల (కేటీఆర్‌), సిద్దిపేట (హరీశ్‌)కు రోడ్లు వేసుకుంటే చాలా? దుబ్బాక, హుస్నాబాద్‌కు రోడ్లు వద్దా? అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 12 వేల కి.మీ, పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 17,300 కి.మీ. కొత్త రోడ్లు నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైబ్రిడ్‌ యాన్యుయిటీ విధానం(హ్యామ్‌)లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని.. దీని వల్ల ప్రజలపై టోల్‌ భారం పడదని స్పష్టం చేశారు.

ఆ చెట్లపై నిర్ణయం తీసుకోండి: స్పీకర్‌

చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ రహదారి నిర్మాణాన్ని త్వరగా మొదలుపెట్టాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ మంత్రి కోమటిరెడ్డికి సూచించారు. ఈ మార్గంలో ఉన్న 200 ఏళ్ల నాటి మర్రిచెట్లు ఎప్పుడు ఎవరిపై పడతాయో తెలియకుండా ఉందని, వాటిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. మంత్రి బదులిస్తూ ఆ మర్రిచెట్ల అంశం వల్లే జాప్యం చోటుచేసుకుంటోందన్నారు. మంగళవారం సభలో దేవాదాయ, విద్యా శాఖ, ఆర్‌ అండ్‌ బీ పద్దులు ఆమోదం పొందాయి. రాత్రి 11 గంటలకు సభ వాయిదా పడింది.


రేషన్‌షాపుల్లో మద్యం అమ్మిన చరిత్ర మీది

‘మద్యం అమ్మకాలతో ఆదాయాన్ని రూ.50 వేల కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ‘కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బెల్ట్‌షాపులు’ ఇవేనా కాంగ్రెస్‌ విధానం? ఎన్నికల మ్యానిఫెస్టోలో బెల్ట్‌షాపులు తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆదాయం కోసం బెల్ట్‌షాపులు ఎలా పెడతారు’ అని ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కొత్తగా బెల్ట్‌షాపులు తేవడం కాదని, లీకేజీలను ఆరికట్టడమే తమ విధానమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ‘రేషన్‌షాపుల్లో కూడా మద్యం అమ్మించిన చరిత్ర మీది’ అని ఎద్దేవా చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్సైజ్‌ ఆదాయం రూ.9 వేల కోట్లు ఉంటే.. 2023 డిసెంబరు నాటికి రూ.34 వేల కోట్లకు చేరిందని, ఇంత ఆదాయాన్ని పెంచిందెవరని ప్రశ్నించారు. 15 నెలల్లో తాము ఒక్క శాతం పన్ను కూడా పెంచలేదన్నారు. ఆదాయం కూడా తగ్గిందని గుర్తుచేశారు. మద్యం ద్వారా అదనపు ఆదాయం కోసం ప్రభుత్వం కృషి చేయడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్లలో మద్యం ఆదాయాన్ని 350 శాతం పెంచారని తెలిపారు. అప్పట్లో విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు ఉండేవని, గత ఏడాది బెల్ట్‌ షాపులకు సంబంధించి సుమారు ఏడు వేల మందిని అరెస్టు చేశారని తెలిపారు. నూతన టూరిజం పాలసీని రూపొందించామని, ప్రభుత్వ ఆదాయంలో పది శాతం పర్యాటక రంగం ద్వారా తేవడానికి వివిధ ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నామని జూపల్లి కృష్ణారావు వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో నూతన పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు.

Updated Date - Mar 26 , 2025 | 03:43 AM