Share News

PM Modi: కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి.. మోదీ, చిరు సందడి

ABN , Publish Date - Jan 14 , 2025 | 03:39 AM

ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.

PM Modi: కిషన్‌రెడ్డి ఇంట సంక్రాంతి.. మోదీ, చిరు సందడి

  • మెగాస్టార్‌కు ప్రధాని ప్రాధాన్యం

  • ఆద్యంతం చిరంజీవిని తనవెంటే తిప్పుకొన్న మోదీ

  • భోగి మంటలు వెలిగించి, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ

న్యూఢిల్లీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అధికార నివాసంలో సంక్రాంతి సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి పాల్గొనడం విశేషమైతే, కార్యక్రమం ఆద్యంతం ఆయనకు మోదీ ప్రాధాన్యమివ్వడం మరీ విశేషం! భోగి సందర్భంగా సోమవారం సాయంత్రం తమ నివాసానికి వచ్చిన మోదీకి చిరంజీవితో కలిసి కిషన్‌రెడ్డి దంపతులు స్వాగతం పలికారు. లోపలికి అడుగుపెట్టిన మోదీ, తొలుత చిరంజీవితో కరచాలనం చేశారు. వేడుకల్లో భాగంగా భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, వేదికపైన జ్యోతి ప్రకాశనం, సాంస్కృతిక కార్యక్రమాల వీక్షణ.. ఇలా ప్రతిదశలోనూ చిరంజీవిని మోదీ తనవెంట తిప్పుకొన్నారు. సంబురాల్లో భాగంగా మోదీ, మంత్రోచ్ఛారణల మధ్య భోగి మంటలను వెలిగించారు. గంగిరెద్దులకు అరటిపండ్లు తినిపించి, నూతన వస్త్రాలు కప్పారు. అనంతరం వేదికపైకి చేరుకున్న మోదీ, జ్యోతి వెలిగించి లాంఛనంగా సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ప్రధానితో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, చిరంజీవి, కిషన్‌రెడ్డి, డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు వేదికపైకి చేరుకుని జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ప్రధానికిశ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం ప్రముఖ గాయని సునీత తన పాటలతో అలరించారు. సంక్రాంతి సంప్రదాయాలను, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా దీపికా రెడ్డి బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను మోదీ వీక్షించారు. సంక్రాంతి వేడుకల్లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, జ్యోతిరాధిత్య సింధియా, బండి సంజయ్‌, పెమ్మసాని చంద్రశేఖర్‌, భూపతి రాజు శ్రీనివాస వర్మతో పాటు హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, బీజేపీ తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్‌, ధర్మపురి అర్వింద్‌, గోడం నగేశ్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌, బీజేపీ ఎంపీలు అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, అరుణ్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. పీవీ సింధూ తన భర్తతో కలిసి వేడుకలకు హాజరయ్యారు. కాగా.. సంక్రాంతి వేడుకల్లో భాగంగా పవిత్రమైన భోగి రోజున ప్రధాని నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. సంక్రాంతి విశిష్టతను తెలియజేస్తూ జరిగిన వేడుకలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారని వెల్లడించారు.


కిషన్‌రెడ్డి ఇంట్లో అద్భుత కార్యక్రమం: మోదీ

’’దేశమంతటా ప్రజలు సంక్రాంతిని, పొంగల్‌ను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. ఇది మన సంస్కృతి, వ్యవసాయ సంప్రదాయాల్లో అంతర్భాగమైన వేడుక’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి ఆరోగ్యం, ఆనందమయ జీవనం లభించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఆయన ఎక్స్‌ వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తన మంత్రివర్గ సహచరుడు కిషన్‌రెడ్డి ఇంట్లో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించినట్లు మోదీ తెలిపారు.

Updated Date - Jan 14 , 2025 | 03:39 AM