Share News

Fee Regulatory Commission: త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్‌

ABN , Publish Date - Mar 26 , 2025 | 05:05 AM

ప్రైవేటు పాఠశాలల ఫీజు నియంత్రణ కోసం ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను త్వరలో ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చి, కొత్త పాఠశాలలు ప్రారంభించడం కంటే ప్రస్తుతవాటిని మెరుగుపరచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు

Fee Regulatory Commission: త్వరలో ఫీజు నియంత్రణ కమిషన్‌

  • ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో దోపిడీకి చెక్‌

  • విద్యా కమిషన్‌ సూచనలతోసంస్కరణలు

  • సభలో మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి త్వరలోనే ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. పదేళ్లలో 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు రావడం మానేశారని, ఈ పరిస్థితిని అధిగమించి.. బడి అంటే భవితలా పాఠశాలలకు కొత్త రూపం తీసుకుని వస్తామని వెల్లడించారు. మంగళవారం శాసనసభలో విద్యాశాఖ పద్దుపై చర్చ సందర్భంగా రాజనర్సింహ మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను పట్టాలు ఎక్కించడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, కమిషన్‌ సూచనలు పరిశీలించి విద్యా వ్యవస్థకు కొత్త రూపం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. కొత్త పాఠశాలలను ప్రారంభించడం కన్నా ప్రస్తుతమున్న వాటిలో వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. బాలికల వసతి గృహల్లో ఐదారు వందల మందికి ఐదారు బాత్‌రూంలు ఉన్నాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కార్పొరేట్‌ కంపెనీలను భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. విశాలమైన తరగతి గదులు, ల్యాబ్‌లు, మంచి నీటి వసతి, పరిశుభ్రమైన వాష్‌రూమ్‌లను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాలల్లో ఉపాధి లక్ష్యంగా కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడానికి అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ విద్యార్థులు 160 క్రెడిట్స్‌ సాధించలేక మధ్యలోనే చదువు వదిలేస్తున్నారని, ఈ పరిస్థితిని అధిగమించడానికి 80 క్రెడిట్స్‌ సాధించినా వారికి ఉపాధి దొరికేలా ఒక సర్టిఫికెట్‌ ఇవ్వాలనే ప్రతిపాదనపై కసరత్తు జరుగుతోందని వివరించారు.


ఉస్మానియా వర్సిటీ అంతటా నిషేధం లేదు..

మన ఊరు-మన బడి పథకంలో పావు శాతం పనులు కూడా పూర్తి చేయలేదని, ఆ పనులను పూర్తి చేయించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి కోరారు. డిగ్రీ కాలేజీలు ఉన్న స్థలానికి సంబంధించిన ల్యాండ్‌ టైటిల్‌ డీడ్స్‌ను ప్రభుత్వం ఇస్తే.. కేంద్ర పథకం ద్వారా రూ.ఐదు కోట్ల గ్రాంటు వస్తుందని, ఈ విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలపై నిషేధం సరికాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. దీనిపై మంత్రి రాజనర్సింహ స్పందించారు. ఉస్మానియా పరిపాలనా భవనం వద్ద మాత్రమే నిషేఽధం ఉందని, యూనివర్సిటీ అంతా కాదని వివరించారు.

Updated Date - Mar 26 , 2025 | 05:06 AM