చంపేస్తాం.. సస్పెండ్ చేయిస్తాం!
ABN , Publish Date - Mar 25 , 2025 | 05:24 AM
సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని కొందరు మొండి బకాయిదారులు.. మునిసిపల్ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు.

ఆస్తిపన్ను వసూలుకు వెళ్లే సిబ్బందికి మొండి బకాయిదారుల బెదిరింపులు
పదేళ్లుగా పన్ను కట్టని ప్రైవేటు స్కూలు
రూ.3.03 లక్షలకు చేరిన బకాయిలు
బాలాపూర్‌లో ఆ స్కూల్ వద్ద మునిసిపల్ సిబ్బంది బైఠాయింపు
సరూర్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని కొందరు మొండి బకాయిదారులు.. మునిసిపల్ అధికారులు, సిబ్బంది పట్ల బెదిరింపులకు దిగుతున్నారు. ఏకంగా చంపేస్తా.. సస్పెండ్ చేయిస్తా.. అని హెచ్చరిస్తున్నారు. దీంతో ఆస్తి పన్ను వసూళ్లకు వెళ్లాలంటే.. మునిసిపల్ అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో పోలీసుల సహకారం తీసుకోవాలని వారు భావిస్తున్నారు. నాలుగేళ్లుగా రూ.2.50 లక్షల ఆస్తిపన్ను బకాయి ఉన్న బడంగ్‌పేట్ ప్రధాన రహదారిలోని ఓ భవనానికి ఇటీవల అధికారులు జప్తు నోటీసు జారీ చేశారు. దీంతో ఆ భవనం యజమాని.. ‘నా భవనం మీద చేయి వేస్తే (సీజ్‌చేస్తే) చంపేస్తా’ అని మునిసిపల్ సిబ్బందిని బెదిరించాడు. అలాగే, బాలాపూర్‌లోని జాన్ మిల్టన్ స్కూల్ యాజమాన్యం పదేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో మొత్తం బకాయి రూ.3.03 లక్షలకు చేరింది.
ఎన్నిసార్లు నోటీసులిచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో 15 రోజుల క్రితం బడంగ్‌పేట్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జప్తు నోటీసు జారీ చేశారు. దీంతో స్కూల్ యజమాన్య ప్రతినిధి ఒకరు మునిసిపల్ కార్యాలయానికి వెళ్లి.. ‘మేం ప్రభుత్వం నుంచి మినహాయింపు తెచ్చుకుంటాం.. అప్పటి వరకు మా జోలికి వస్తే సస్పెండ్ చేయిస్తాం’ అని హెచ్చరించి వెళ్లినట్టు అధికారులు తెలిపారు. దాంతో సోమవారం మధ్యాహ్నం అదనపు కమిషనర్ (ఏఎంసీ) శ్యాంసుందర్ సహా అధికారులు, సిబ్బంది.. తరగతుల నిర్వహణ సమయం ముగియగానే స్కూల్‌కు వెళ్లి సీజ్ చేయడానికి ప్రయత్నించారు. స్కూలు సిబ్బందిని బయటకు రమ్మన్నా వారు మొండికేశారు. పైగా ‘ఏం చేసుకుంటారో.. చేస్కోండి’ అంటూ యాజమాన్యం బెదిరింపులకు దిగడంతో చివరికి 20 మంది మునిసిపల్ సిబ్బంది, అధికారులు స్కూల్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారంలోగా పన్ను చెల్లించకపోతే భవనం సీజ్ చేయకతప్పదని ఏఎంసీ శ్యాంసుందర్ స్కూలు యాజమాన్యానికి స్పష్టం చేశారు.