ఆపరేషన్ జిందగీ!
ABN , Publish Date - Feb 24 , 2025 | 03:44 AM
గుర్తుందా? 2023 నవంబరు 12న.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలోని సిల్‌క్యారా బెండ్-బార్‌కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు! అధికారులు.. ‘ఆపరేషన్ జిందగీ’ పేరిట వారిని కాపాడే మిషన్‌ను చేపట్టారు.

2023లో ఉత్తరకాశీలో కూలిన సొరంగం
లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు
17రోజులపాటు కష్టపడి కాపాడిన అధికారులు
‘ర్యాట్‌హోల్’ మైనింగ్‌తో బాధితులు బయటకు!
హైదరాబాద్, ఫిబ్రవరి 23: గుర్తుందా? 2023 నవంబరు 12న.. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలోని సిల్‌క్యారా బెండ్-బార్‌కోట్ టన్నెల్ కుప్పకూలి 41 మంది అందులో చిక్కుకుపోయారు! అధికారులు.. ‘ఆపరేషన్ జిందగీ’ పేరిట వారిని కాపాడే మిషన్‌ను చేపట్టారు. అయితే లోపల్నుంచీ వారిని బయటకు తేవడానికి 17 రోజులు పట్టింది! అదీ అంత సులభంగా కాలేదు. జాతీయ విపత్తు స్పందన దళాలు, రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, ఉత్తరాఖండ్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి, సరిహద్దు రహదారుల సంస్థ నుంచి ఇంజనీర్లు.. అక్కడికి చేరుకుని బాధితులను బయటకు తెచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. ఆస్ట్రేలియా నుంచి టన్నెలింగ్ నిపుణులైన ఆర్నాల్డ్ డిక్స్, క్రిస్ కూపర్ సహా ఎందరో ప్రైవేటు నిపుణులను సైతం రంగంలోకి దించారు. లోపలున్నవారు బయటకు వచ్చే గొట్టాన్ని (ఎస్కేప్ పైప్) ఏర్పాటు చేయడానికి తొలుత ఉపయోగించిన పరికరంతో అనుకున్నంత వేగంగా పని జరక్కపోవడంతో.. ఢిల్లీ నుంచి 25 టన్నుల బరువుండే అత్యంత అధునాతన హారిజాంటల్ అగర్ డ్రిల్లింగ్ మెషీన్‌ను రప్పించారు. మూడు భాగాలుగా వచ్చిన ఆ మెషీన్‌ను.. సొరంగం వద్దకు తెచ్చి బిగించి డ్రిల్లింగ్ కొనసాగించారు.
ఒకవైపు డ్రిల్లింగ్ పనులు కొనసాగుతుండగానే.. థాయ్‌లాండ్‌లో 2018లో థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుపోయిన విద్యార్థులను కాపాడిన నిపుణులను సంప్రదించి వారి సలహాలు తీసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ డ్రిల్లింగ్ మిషన్ పాడైపోవడంతో 17వ తేదీన తాత్కాలికంగా పనులు ఆపేసి కొత్త వ్యూహాన్ని అవలంబించారు. అందులో భాగంగా.. ప్రధాన సొరంగానికి సమాంతరంగా 3 ప్రత్యామ్నాయ సొరంగాల్ని తవ్వి వాటిలోంచి మూడు పైపులు వేసి ఒక పైపు గుండా ఆహారం, ఒక పైపు గుండా ఆక్సిజన్, ఒక పైపు ద్వారా ఎండోస్కోపిక్ కెమెరా పంపారు. కానీ, అసలు పని మాత్రం నత్తనడకనే సాగింది. అడ్డుగా ఉన్న శిథిలాల కారణంగా 23వ తేదీ నాటికి డ్రిల్లింగ్ మెషీన్ దెబ్బతింది. దానికి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. అయితే అప్పటికే.. లోపలున్నవారికి 75ు దగ్గరకు చేరగలిగారు. దగ్గరకి వచ్చేశామని ఆనందించేలోపే.. నవంబరు 25న డ్రిల్లింగ్ మెషీన్ విరిగిపోయింది. దీంతో రెస్క్యూ టీమ్ ఇక యంత్రాలపై ఆధారపడడం మానేసి చేతులతో ఉపయోగించే పరికరాలతో (సుత్తి, ఉలి వంటివి) తవ్వకం కొనసాగించాలని నిర్ణయించారు. దీన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఒక్క మనిషి మాత్రమే వెళ్లగలిగే గుంతలు తవ్వే విధానం ఇది. నిజానికి దీనిపై మనదేశంలో నిషేధం ఉంది. అయినప్పటికీ.. ఆ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించి, అందులో నిపుణులైన మైనర్లను రంగంలోకి దించారు. వారు దాదాపు 24 గంటలపాటు తవ్వకం జరిపి లోపలికి ఒక పైపును చొప్పించగలిగారు. లోపల చిక్కుకున్న ఒక్కో బాధితుడూ ఆ పైపు గుండా బయటకు వచ్చారు. అలా సొరంగంలో చిక్కుకున్న మొత్తం 41 మందినీ కాపాడారు.