Bail to Allu Arjun: అల్లు అర్జున్‌కు బెయిల్..
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:19 PM
హైదరాబాద్, జనవరి 03: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీలసలాట ఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టుల ఈ మేరకు తీర్పు వెలువరించింది.

హైదరాబాద్, జనవరి 03: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు శుక్రవారం నాడు ఈ మేరకు తీర్పునిచ్చింది. అల్లు అర్జున్ న్యాయవాది వాదనలను ఏకీభవించిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్‌పై BNS యాక్ట్ 105 వర్తించదని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారణం కాదని వాదించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి, అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్లు దూరం ఉందని కోర్టుకు వివరించారు న్యాయవాది.
అయితే, అల్లు అర్జున్ రావడం వలనే తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అల్లు అర్జున్ రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదున్నారు పీపీ. అల్లు అర్జున్ పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. అతనికి బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పీపీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు ధర్మాసనం.. అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. రూ. 50 వేలు, రెండు పూచికత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. కాగా, ప్రస్తుత అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
కోర్టు విధించిన షరతులివే..
అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం.. కొన్ని షరతులు విధించింది. తొలుత అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేస్తూ రూ. 50 వేలు, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయొద్దని సూచించింది. కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా ఎలాంటి కామెంట్స్ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలని షరతు విధించింది.
డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్దకు హీరో అల్లు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు, నటి రష్మిక మందన, ఇతర చిత్ర బృందం వచ్చారు. ఈ క్రమంలో వీరిని చూసేందుకు థియేటర్ వద్దకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. దీంతో అక్కడ తొక్కీసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి చనిపోగా.. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సహా 18 మందిపై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో కూడా ఉంచారు. కోర్టుకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ వేయగా.. కోర్టు మంజూరు చేసింది.