Share News

Medaram: మేడారంలో ఘనంగా మినీ జాతర

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:28 AM

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క- సారలమ్మల మినీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది.

Medaram: మేడారంలో ఘనంగా మినీ జాతర

  • భారీగా తరలివస్తున్న భక్తులు

  • మంచిర్యాలలో గోదావరి వెలవెల

  • సమ్మక్క మినీ జాతర, శివరాత్రి స్నానాలకు ఇబ్బందులు

తాడ్వాయి/మంచిర్యాల, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క- సారలమ్మల మినీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడకలో భాగంగా తొలిరోజు ప్రధాన ఘట్టంగా మండమెలిగె కార్యక్రమాన్ని పూజారులు నిర్వహించారు. తెల్లవారుజామున గంగా స్నానాలు ఆచరించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క మందిరం, కన్నెపల్లిలోని సారలమ్మల మందిరాన్ని మహిళలు శుద్ధి చేసి తల్లుల ఆది స్థానాలను ఆలుకుపూతలు చేసి ముగ్గులు వేశారు. వనదేవతల అంతర్గత మందిరాల్లో సమ్మక్కకు సిద్దబోయిన వంశీయులు, సారలమ్మకు కాక వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలోని దేవతలను పూజించారు. దీప దూప నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డోలు వాయిద్యాల నడుమ గ్రామానికి నాలుగు వైపులా ద్వార స్తంభాలు ఏర్పాటు చేసి దిష్ఠి తోరణాలు కట్టారు. ఈ క్రమంలో వనదేవతల గుడుల్లో మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆనవాయితీలో భాగంగా చర్ప వంశీయులు దివంగత మాజీ ఎమ్మెల్యే చర్ప భోజరావు కుటుంబ సభ్యులు సహా ఊరట్టం గ్రామం నుంచి డోలు వాయిద్యాల నడుమ సెలపెయ్యను గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్క, సారలమ్మ పూజారులకు అందజేశారు. అనంతరం సాయంత్రం ఇలవేల్పులను ఘనంగా తమ తమ మందిరాలకు చేర్చారు. డోలు వాయిద్యాలు, కొమ్ము శబ్దాల నడుమ మహిళలు నీళ్లు ఆరబోస్తుండగా వడ్డెలు (పూజారులు) గద్దెల వద్దకు చేరుకొని జాగారం చేశారు. గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలిరోజు సుమారు 2.5 లక్షల మంది మేడారం చేరుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.


శివరాత్రి జాతర వరకైనా నీటిని విడుదల చేయండి

వేసవికాలం రాకముందే గోదావరి నదిలో నీటి ప్రవాహం పూర్తిగా అడుగంటింది. మంచిర్యాలలో గోదావరి ఒడ్డున సమ్మక్క-సారలమ్మ మినీ జాతర బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరుగనున్న జాతరకు జిల్లా వాసులతోపాటు పొరుగు జిల్లాల భక్తులు ఇక్కడకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు చెల్లించుకుంటారు. ప్రస్తుతం గోదావరిలో స్నానం చేసేందుకు తగినంత నీరు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ నెల 26న శివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలో జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గోదావరిలో లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. భక్తులు స్నానాలు ఆచరించేనందుకు నీరు అందుబాటులో లేదు. కనీసం శివరాత్రి జాతర వరకైనా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - Feb 13 , 2025 | 04:28 AM