Share News

Hyderabad: మరో ఎమ్మెల్సీ ఎన్నిక

ABN , Publish Date - Mar 25 , 2025 | 03:22 AM

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 23న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.

Hyderabad: మరో ఎమ్మెల్సీ ఎన్నిక

  • హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసిన ఈసీ

  • ఏప్రిల్‌ 23న పోలింగ్‌.. 25న ఓట్ల లెక్కింపు

  • ఎమ్మెల్సీ స్థానం పరిధిలో 115 మంది ఓటర్లు?

  • అసెంబ్లీ నుంచి వివరాలు సేకరిస్తున్న బల్దియా

  • కొత్త ఎమ్మెల్సీల సమాచారం తెలిశాక స్పష్టత

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 23న ఈ ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌ స్థానానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఎంఎస్‌ ప్రభాకర్‌రావు పదవీకాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 29లోపు ఎన్నికల ప్రక్రియను ముగించనున్నట్టు ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 4 వరకునామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్‌ 7న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 9 వరకు గడువు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. అనంతరం ఏప్రిల్‌ 23న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని, 25న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల కావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు.. హైదరాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధుల(ఓటర్ల) లెక్కలు తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజ్యసభ/లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల విషయంలో ఇబ్బంది లేనప్పటికీ.. ఎంత మంది ఎమ్మెల్సీలు హైదరాబాద్‌ జిల్లాను ఆప్షన్‌గా ఎంచుకున్నారన్న దానిపై అస్పష్టత నెలకొంది. ఇందుకోసం బల్దియాలోని ఎన్నికల విభాగం, కార్యదర్శి కార్యాలయ అధికారులు సోమవారం అసెంబ్లీకి వెళ్లారు. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం రావాల్సిందిగా వారికి సూచించినట్టు సమాచారం.


ఓటర్లుగా 115 మంది ప్రజాప్రతినిధులు?

జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉండగా.. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని కార్పొరేటర్ల సంఖ్య 84. వీరిలో గుడిమల్కాపూర్‌, ఎర్రగడ్డ కార్పొరేటర్లు మరణించారు. ఎంఐఎంకు చెందిన శాస్ర్తిపురం, మెహిదీపట్నం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం జిల్లా పరిధిలో 80 మంది కార్పొరేటర్లున్నారు. ఇద్దరు ఎంపీలు (హైదారాబాద్‌, సికింద్రాబాద్‌), నలుగురు రాజ్యసభ సభ్యులు, 15 మంది ఎమ్మెల్యేల లెక్క తేలింది. ఎమ్మెల్సీల సంఖ్యపై స్పష్టత రానప్పటికీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం వర్గాలు మాత్రం 14 మంది ఉండవచ్చని సూత్రప్రాయంగా చెబుతున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం జిల్లాలో ఓటర్లుగా ఉన్న ప్రజాప్రతినిధుల సంఖ్య 115గా ఉంది. ఇక ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారిలో ఇద్దరు హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశముందని సమాచారం. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య మారే అవకాశం లేకపోలేదు. సూత్రప్రాయ ఓటర్లలో అత్యధికంగా ఎంఐఎం బలం-52గా ఉంది. బీజేపీ కార్పొరేటర్లు -17, బీఆర్‌ఎస్‌-14, కాంగ్రెస్‌-7 ఉన్నారు. బీజేపీకి ఒక ఎంపీ, ఎమ్మెల్యే ఉండగా.. బీఆర్‌ఎస్‌ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు, కాంగ్రె్‌సకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్సీల లెక్క తేలిన అనంతరం ఏ పార్టీ బలం ఎంతన్న దానిపై స్పష్టత వస్తుందని ఎన్నికల విభాగం వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

For Telangana News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 03:22 AM