Seethakka: రాష్ట్రం పరువు తీసింది కేసీఆర్ కుటుంబమే: సీతక్క
ABN , Publish Date - Mar 22 , 2025 | 03:45 AM
సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘‘మీ కుటుంబమే రాష్ట్రం పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

కేసీఆర్ అర్జునుడు కాదు.. అవినీతి పరుడు: జూపల్లి
హైదరాబాద్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ‘‘మీ కుటుంబమే రాష్ట్రం పరువు తీసింది. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కాంగ్రె్‌సది త్యాగాల చరిత్ర’’ అని సీతక్క అన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్‌ఎస్సేనని ఆరోపించారు. మహిళలకు అడుగడుగునా బీఆర్‌ఎస్ అన్యాయం చేసిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో ఇష్టానుసారంగా అంచనాలు పెంచి దోచుకున్నారన్నారు.
బీఆర్‌ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63సీట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే బంపర్ మెజారిటీ, తాము అధికారంలోకి వస్తే ఒక్క శాతంతో అధికారంలోకి వచ్చామనడం సరికాదన్నారు. కాగా, బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో బడ్జెట్ రూపొందించేటప్పుడు అన్ని అంశాలను కేసీఆర్ సునిశితంగా పరిశీలించేవారని, మహాభారతంలో అర్జునుడి మాదిరిగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కేసీఆర్ అర్జునుడు కాదు అవినీతిపరుడని విమర్శించారు. గత ప్రభుత్వ పాలన తీరుపై జూపల్లి మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం చెప్పారు.