PSR Anjaneyulu: పీఎస్సార్ అరెస్టు..
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:56 AM
ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు... ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
జత్వానీ కేసులో ‘ఏ2’కు సీఐడీ ఝలక్
హైదరాబాద్‌లో వియ్యంకుడి ఇంట్లో ఉండగా అరెస్టు.. విజయవాడకు తరలింపు
నేటి ఉదయం కోర్టుకు సీనియర్ ఐపీఎస్
అమరావతి/విజయవాడ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు... ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పీఎస్సార్, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటుపడింది. కాంతి రాణా, విశాల్ గున్నీ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో ఏ2గా ఉన్న పీఎస్సార్ మాత్రం, ‘డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరూ టచ్ చేయలేరు’ అన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ... సీఐడీ అధికారులు అనూహ్యంగా ఝలక్ ఇచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయనను అరెస్టు చేశారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం అమ్మాడాపూర్‌లో ఐదేళ్ల కిందట పీఎస్సార్ ఆంజనేయులు 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులోనే ఫామ్‌హౌస్ నిర్మించుకుని అక్కడే నివసిస్తున్నారు. అయితే, పీఎస్సార్ హైదరాబాద్ కుందన్‌బాగ్‌లో ఉన్న వియ్యంకుడి ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న సీఐడీ అధికారులు మంగళవారం ఉదయం అక్కడికే వెళ్లి పీఎస్సార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మొయినాబాద్ ఫార్మ్ హౌస్‌కు తీసుకెళ్లి... సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం విజయవాడ కానూరులో ఉన్న సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. బుధవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి... కోర్టులో హాజరు పరచనున్నారు.
ఇదీ కేసు నేపథ్యం...
జగన్‌కు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌ను ముంబైలో నమోదైన కేసు నుంచి బయటపడేసేందుకు అప్పట్లో భారీ స్కెచ్ వేశారు. ఆయనపై ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీని బెదిరించి దారికి తెచ్చుకుని... కేసు వాపస్ చేసుకునేలా స్కెచ్ గీశారు. ఇందులో... కీలకపాత్ర అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుదే! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వానీ తనకు జరిగిన అన్యాయంపై విజయవాడ పోలీసులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్, పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ, అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ, పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావుతోపాటు మరి కొంతమందిపై కేసు నమోదైంది. ఆ తర్వాత కేసును సీఐడీకి బదిలీ చేశారు. విద్యాసాగర్ బెయిలుపై బయటకు వచ్చారు. అరెస్టు నుంచి కాంతిరాణా, విశాల్‌గున్నీకి హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
ఈ కేసుతో నాకు సంబంధం లేదు?: పీఎస్సార్
కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టుతో తనకేమీ సంబం ధం లేదని పీఎస్సార్ పేర్కొన్నట్లు తెలిసింది. సీఐడీ కార్యాలయంలో ఆయనను మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రశ్నించారు. ‘‘కాదంబరి జెత్వానీ బ్యాడ్ లేడీ. ఆమెను అరెస్టు చేసింది విజయవాడ పోలీసులు. ఇది లోకల్ పోలీసులకు సంబంధించిన కేసు. నన్ను ఎందుకు అరెస్టు చేశారు’’ అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
CM Revanth Praised Women: సన్నబియ్యంతో సహపంక్తి భోజనం.. మహిళకు సీఎం అభినందనలు
Read Latest Telangana News And Telugu News