Share News

SLBC Tunnel: టన్నెల్‌ మధ్యలో ద్వారం!

ABN , Publish Date - Feb 28 , 2025 | 05:11 AM

‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్‌ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్‌ తవ్వకం మరో విధంగా ఉండేది’’ ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్‌ నిపుణుడి నోటా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది.

SLBC Tunnel: టన్నెల్‌ మధ్యలో ద్వారం!

25వ కిలోమీటర్‌ వద్ద ఏర్పాటుకు 30 ఏళ్ల క్రితమే అనుమతినిచ్చిన కేంద్రం!

  • తిర్మలాపూర్‌ సమీపంలో ఏర్పాటుకు వెసులుబాటు

  • 1994 ఏప్రిల్‌ 22న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ అనుమతి

  • వెలుగులోకి ఆ కీలక రికార్డు

  • ద్వారంతో టన్నెల్‌ తవ్వకం సులభమయ్యే చాన్స్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ‘‘శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం మధ్యలో బయటికి వెళ్లే దారి లేనందువల్లే టన్నెల్‌ తవ్వకంలో సమస్యలు వస్తున్నాయి. సొరంగం మధ్యలో దారి ఉంటే టన్నెల్‌ తవ్వకం మరో విధంగా ఉండేది’’ ప్రస్తుతం ప్రతి ఇంజనీరింగ్‌ నిపుణుడి నోటా వ్యక్తమవుతున్న అభిప్రాయమిది. టన్నెల్‌ పైకప్పు కూలి.. ప్రమాదం జరగడం, అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బయటికి వెళ్లే దారి (యాడిట్‌) అంశంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లుగా.. సొరంగానికి బయట ద్వారం ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి లేదంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతూ వచ్చారు. కానీ, వారు చెప్పినవి అవాస్తవాలు అని, యాడిట్‌ ఏర్పాటుకు అనుమతి ఉందని చెప్పే కీలక పత్రం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, పులుల అభయారణ్యం కావడంతో యాడిట్‌ ఏర్పాటుకు అనుమతిని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నిరాకరించిందన్నది అవాస్తవమని తేలింది. మూడు దశాబ్దాల కిందటే యాడిట్‌ తవ్వకానికి కేంద్రం అనుమతినిచ్చిన విషయం స్పష్టమవుతోంది. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజెక్టుకు 1994 ఏప్రిల్‌ 22న పర్యావరణ అనుమతి లభించింది. ఆ అనుమతి పత్రంలో పలు షరతులు/వెసులుబాట్లను పేర్కొన్న పర్యావరణ మంత్రిత్వ శాఖ.. అందులో మూడో పేరాలోనే యాడిట్‌ ఏర్పాటుకు వెసులుబాటు కల్పించింది. టన్నెల్‌ వెళ్లే మార్గమంతా అమ్రాబాద్‌ మండల పరిధిలో ఉండగా.. అదే మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామ సమీపంలో ఆదిమజాతి గిరిజనులు (పీటీజీ) నివాసముండే ప్రాంతానికి సమీపంలో టన్నెల్‌ మధ్యలో 25 కిలోమీటర్ల వద్ద యాడిట్‌ ఏర్పాటుకు అవకాశం ఇచ్చింది.


ఏకకాలంలో రెండు వైపుల నుంచి తవ్వకం..

ఈ ప్రాజెక్టులో 43 కిలోమీటర్ల మేర ఒకటే టన్నెల్‌ను ప్రతిపాదించగా.. ఇందుకోసం ఓవైపు ఇన్‌లెట్‌ (దోమలపెంట) నుంచి, మరోవైపు ఔట్‌లెట్‌ (మన్నెవారిపల్లి) నుంచి తవ్వుకుంటూ పోవాలని నిర్ణయించారు. ఈ మేరకు శ్రీశైలం రిజర్వాయర్‌లోని నీటిని తీసుకునే ప్రాంతం నుంచి చేపట్టిన ఇన్‌లెట్‌ టన్నెల్‌ను 13.936 కిలోమీటర్లు తవ్వగా, అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి నుంచి 20.436 కి లోమీటర్లు తవ్వారు. మరో 9.56 కిలోమీటర్ల మేర రెండువైపుల నుంచి తవ్వితే టన్నెల్‌ పూర్తవుతుంది. కాగా, ఇన్‌లెట్‌ నుంచి టన్నెల్‌ 25 కిలోమీటర్ల వద్ద యాడిట్‌ ఏర్పాటుకు అనుమతి ఉన్న నేపథ్యంలో మన్నెవారిపల్లి నుంచి 18వ కిలోమీటర్‌ వద్ద దీనిని పెట్టుకునే వెసులుబాటు లభించినట్లయింది. ప్రభుత్వం దీనిని చేపడితే టన్నెల్‌ తవ్వకం సులువవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. టన్నెల్‌ తవ్వకం అనంతరం టీబీఎంలను బయటికి తీసేందుకు, నిరంతర/అత్యవసర నిర్వహణ పనులకూ యాడిట్‌ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కాగా, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రాజె క్టును 2005 ఆగస్టు 11న రూ.2,813 కోట్ల నిర్మాణ అంచనాలతో చేపట్టడానికి ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతినిచ్చింది. ఈ మేరకు 2005లోనే టన్నెల్‌ పనులకు రూ.2,259 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలవగా.. జయప్రకాష్‌ అసోసియేట్‌ (జేపీ అసోసియేట్‌) 9 శాతం తక్కువకే పనులు దక్కించుకుంది. రూ.1925 కోట్లతో 2005 ఆగస్టు 25న ఒప్పందం కుదిరింది. ఇప్పటిదాకా రూ.2,689 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఆ తర్వాత దీని అంచనాలను రూ.3,152 కోట్లకు, మళ్లీ గతేడాది అక్టోబరు 14న రూ.4,637.75 కోట్లకు సవరించారు.


అనుమతుల సమయంలోనే ప్రతిపాదన

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను 43 కిలోమీటర్లకు పైగా పొడవున తవ్వుతున్న నేపథ్యంలో.. మధ్యలో సొరంగం నుంచి బయటికి వెళ్లే ద్వారం కచ్చితంగా ఉండాల్సిందేనని 1994లో పర్యావరణ అనుమతుల సమయంలోనే ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి మన్నెవారిపల్లికి వచ్చే మార్గంలో టన్నెల్‌ 25 కిలోమీటర్ల వద్ద తిర్మలాపూర్‌ గ్రామం సమీపంలో ఈ యాడిట్‌ ఏర్పాటు చేసేలా ప్రతిపాదన ఉంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ టన్నెల్‌ పనులు ప్రారంభం కాగా, యాడిట్‌ ఏర్పాటు విషయాన్ని ఏ దశలోనూపట్టించుకోలేదు. దాంతో టన్నెల్‌ పనులు క్లిష్టతరంగా మారిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 ఏళ్లపాటు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం లేని జాబితాలో ఉండిపోయింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఈ ప్రాజెక్టుపై పలు సభల్లో పెదవి విరిచారు.ఈ సొరంగానికి యాడిట్‌ లేదని చెప్పారు. టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యాక ఇన్‌లెట్‌, ఔట్‌లెట్‌ నుంచి తవ్వుకుంటూ వచ్చే టీబీఎంలను అటు ఇటు పక్కకు తవ్వి.. కప్పేయాలని ఉందన్నారు. వాస్తవానికి యాడిట్‌ లేకపోతే చేయాల్సింది కూడా అదే. కానీ, యాడిట్‌కు వెసులుబాటు ఉండటంతో దాని ఆధారంగా టీబీఎంలను బయటికి తీయడమే కాకుండా.. టన్నెల్‌ తవ్వకం సులభతరం అయ్యే అవకాశాలూ ఉంటాయి.


Also Read:

గుంటూరు జిల్లా వాసి అరుదైన రికార్డు

ఈ చిట్కా పాటిస్తే.. రూ. 40 వేలు మీ జేబులోకే..

రూ. 108కే రీఛార్జ్ ప్లాన్.. డేటాతోపాటు కాల్స్ కూడా..

For More Telangana News and Telugu News..

Updated Date - Feb 28 , 2025 | 05:11 AM