TTD: తిరుపతిలో తొక్కిసలాట ఆరుగురి దుర్మరణం
ABN , Publish Date - Jan 09 , 2025 | 03:38 AM
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది.
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో అపశ్రుతి
రాత్రి 8.50కి క్యూలైన్‌లోకి అనుమతి
ఒక్కసారిగా దూసుకొచ్చిన భక్తులు
ఒత్తిడి తట్టుకోలేక తెరుచుకున్న గేటు
ఒక్కసారిగా తోపులాట.. నలిగిన భక్తులు
పెద్దసంఖ్యలో భక్తులకు గాయాలు
టీటీడీ చరిత్రలో తొలిసారి ఇలాంటి దుర్ఘటన
‘తిరుమల’ చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది! రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ... తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ సంభవించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా... తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు... తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో... పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో... బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా... వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ... మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
తిరుపతి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. టోకెన్ల జారీకి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేయగా... బైరాగిపట్టెడ వద్ద ఈ దారుణం జరిగింది. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీని కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్లను జారీ చేయాలని టీటీడీ యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే... బుధవారం మధ్యాహ్నం నుంచే కేంద్రాల వద్దకు భారీగా భక్తులు తరలి రావడం మొదలైంది. రాత్రి 8 గంటలకు ఒత్తిడి మరింత పెరిగింది. క్యూలైన్లలోకి రాత్రి 9 గంటల నుంచి భక్తులను పంపించడం మొదలుపెట్టారు. దీంతో కేంద్రాల వెలుపల నిరీక్షిస్తున్న భక్తులు క్యూలైన్లలో ప్రవేశించడానికి ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాటలు జరిగాయి. మరీ ముఖ్యంగా... బైరాగిపట్టెడ, విష్ణు నివాసం, ఇందిరా మైదానం కేంద్రాల వద్ద తొక్కిసలాటలు జరిగాయి.
మరణ మృదంగం
ప్రత్యక్షసాక్షులు, ఇతర వర్గాల కథనం ప్రకారం... బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్ హైస్కూలు ఆవరణలో టోకెన్ల జారీకి పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడికి మధ్యాహ్నం నుంచే తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు, తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. హైస్కూలు వెనుకవైపు ఉన్న మునిసిపల్ పార్కులో కూర్చుని... క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారు. రాత్రి 8.50 సమయంలో క్యూలైన్లలోకి అనుమతించడంతో ఒక్కసారిగా అందరూ లేచి పరుగులు తీశారు. పార్కు నుంచి స్కూలులోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గేటుపై జనం పడటంతో అది ఒక్కసారిగా తెరుచుకుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భక్తులు లోనికి వెళ్లేందుకు యత్నించడంతో తొక్కిసలాట జరిగింది.
భక్తుల్లో మహిళలు, వృద్ధులు కూడా ఉండడంతో చాలామంది కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు అదనపు బలగాలను రప్పించి అదుపు చేసేసరికే దారుణం జరిగిపోయింది. తొక్కిసలాటలో చిక్కుకున్న పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు, సీపీఆర్ వంటి చర్యలు చేపట్టారు. మరో కథనం ప్రకారం... బైరాగిపట్టెడ కేంద్రంలో ఒక మహిళ అస్వస్థతకు గురి కావడంతో ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు అక్కడున్న పోలీసు అధికారి గేటును తెరిచారని, దీంతో భక్తులు ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. క్షతగాత్రులను రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు.
తొక్కిసలాట ఘటనలో మృతులు
బుద్దేటి నాయుడుబాబు (51) నర్సీపట్నం, మల్లిక (47) తమిళనాడు, రజని (47) , శాంతి (40) విశాఖపట్నం , రాజేశ్వరి , నిర్మల తమిళనాడు,
ప్రత్యక్ష సాక్షుల వాయిస్
కౌంటర్ల వద్ద కనీసం సౌకర్యాలు కల్పించలేదు, పోలీసుల నిర్లక్ష్యం బాగా ఉంది. అర్థగంట ముందుగా వచ్చిన రద్దీని కంట్రోల్ చేసుంటే కచ్చితంగా తొక్కిసలాట జరిగేది కాదు. అలాగే సకాలంలో స్పందించి వుంటే కూడా ఈ దారుణం చోటుచేసుకునేదికాదు.
- సీపీ రమణ (నర్సీపట్నం)
మా కళ్లముందే మావాళ్లను తొక్కేయడం చూసా. ఇది పూర్తిగా పోలీసుల వైపల్యమే. బయట ఉన్నారే గాని పార్కు లోపలకువచ్చి కంట్రోల్ చేయలేకపోయారు. ప్రశ్నిస్తే పార్కులోపల తమకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెప్పారు.
- మునివెంకటప్ప(ఊలపాడు)
అందరూ కలసి ఒక్కసారిగా గేటును నెట్టుతున్న సమయంలో పోలీసులు స్పందించి అదుపు చేసుంటే పరిస్థితి చక్కబడేది. అయినా జరిగిన సంఘటనలో నా భార్య, బిడ్డలు గాయపడ్డారు. అదృష్టవశాత్తు స్వల్పగాయాలతో బతికి బయటపడ్డారు. అంతా స్వామి కరుణ అనుకుంటున్నాం. మేము ఎంతో దూరం నుంచి వచ్చాం. స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే ఇలా జరుగుతుందని ఊహించలేదు.
-బి.అంజప్ప(నర్సాపురం)
తీవ్రంగా కలిచివేసింది: చంద్రబాబు
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో దుర్ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తొక్కిసలాటలో చనిపోవడం పట్ల దిగ్ర్భాంతి చెందారు. ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని అన్నారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై బుధవారం రాత్రి డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంపై అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీసి.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ముగ్గురు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత తిరుపతికి హుటాహుటిన బయలుదేరారు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 9.30 గంటలకు తిరుపతి బయలుదేరి వెళ్లనున్నారు.