Share News

State Election Commission: స్థానికంలో ఏకగ్రీవాలకు చెల్లుచీటీ!?

ABN , Publish Date - Feb 13 , 2025 | 03:52 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెల్లు చీటీ పాడనుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క అభ్యర్థి బరిలో ఉన్నా సరే.. ఎన్నిక నిర్వహించనుంది.

State Election Commission: స్థానికంలో ఏకగ్రీవాలకు చెల్లుచీటీ!?

బరిలో ఒక్కరున్నా నోటాతో పోటీ పడాల్సిందే.. ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏంచేద్దాం?

  • పార్టీల అభిప్రాయాలు కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చెల్లు చీటీ పాడనుంది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఒక్క అభ్యర్థి బరిలో ఉన్నా సరే.. ఎన్నిక నిర్వహించనుంది. అందులో సదరు సింగిల్‌ అభ్యర్థి.. నోటాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎన్నికల నియమావళిని మార్చేందుకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌.. బుధవారం ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయింది. సింగిల్‌ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలన్న అంశంపై వారి అభిప్రాయాలను సేకరించింది. సమావేశంలో కాంగ్రెస్‌ తరపున సీనియర్‌ నేతలు కమలాకర్‌, రాహుల్‌, బీఆర్‌ఎస్‌ తరపున సోమ భరత్‌, పల్లె రవి, రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి మల్లారెడ్డి, ఆంటోనీరెడ్డి, సీపీఎం నుంచి డీజీ నర్సింహారావు, సీపీఐ నుంచి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. వీరితోపాటు టీడీపీ, జనసేన, ఆమ్‌ఆద్మీ పార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. తొలుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణీ కుముదిని మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లోనూ నోటా ఆప్షన్‌ను అందుబాటులో ఉంచాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు.


తదనుగుణంగా 2016లో ఖమ్మం కార్పొరేషన్‌, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో తొలి సారి నోటాను అమలు చేశామన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018, తెలంగాణ మునిసిపాలిటీల చట్టం-2019లో పేర్కొన్న ఎన్నికల నియమావళిని అనుసరించి జరిగిన తొలి సార్వత్రిక పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికల్లో నోటాను అమలు చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నప్పుడు మాత్రమే పోలింగ్‌ జరుగుతుందని, నోటాకు పోలైన ఓట్లు పరిగణనలోకి తీసుకోకుండా పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు ఎన్నికైనట్లు ప్రకటించే విధానం అమల్లో ఉందన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నామని అన్నారు. అయితే, అభ్యర్థి ఒకరే ఉన్నప్పుడు సుప్రీం కోర్టు ఉత్తర్వు అమలు కావడం లేదన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిపారు. బరిలో ఒక్క అభ్యర్థే ఉన్నా.. బ్యాలెట్‌లో నోటాను జత చేసి ఎన్నిక నిర్వహించడం, ఆ ఎన్నికలో నోటాకు ఎక్కువ ఓట్లు పోలైతే రీఎలక్షన్‌ పెట్టాలా? వద్దా? అనే అంశాలపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. మహారాష్ట్ర, హరియాణా, ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘాలు.. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ఎన్నికను రద్దు చేసి.. తిరిగి ఎన్నికను నిర్వహిస్తున్నాయని గుర్తు చేశారు. ఆ తర్వాత కూడా నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే వాటిని పరిగణనలోకి తీసుకోకుండా.. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తున్నాయన్నారు. ఈ అంశంపైనా అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.


నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేయాలన్న అంశంపై సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలైందని, వచ్చే నెల 10వ తేదీలోగా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉందని, ఆ తర్వాతే తమ అభిప్రాయం చెబుతామని బీజేపీ ప్రతినిధి మల్లారెడ్డి చెప్పారు. సింగిల్‌ అభ్యర్థి ఉన్నప్పుడు నోటాను చేర్చి ఎన్నిక నిర్వహించే అంశానికి మిగిలిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులూ మద్దతు పలికారు. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా.. వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని, అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని గెలిచినట్లుగా ప్రకటించాలని కాంగ్రెస్‌, సీపీఎం డిమాండ్‌ చేశాయి. సింగిల్‌ అభ్యర్థి ఉన్నప్పుడు నోటాను చేర్చి పోలింగ్‌ జరిపినా ఇదే విధానాన్ని అనుసరించాలని అభిప్రాయపడ్డారు. మళ్లీ ఎన్నిక అంటే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌, సీపీఐ, జనసేన, ఆమ్‌ఆద్మీ పార్టీల ప్రతినిఽధులు మాత్రం.. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే తిరిగి ఎన్నిక నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులు రీ ఎలక్షన్‌లో పోటీ చేయకుండా నిబంధన పెట్టాలని సీపీఐ అభిప్రాయపడింది. అయితే, ఆయా అంశాలపై వారంలోగా రాతపూర్వక అభిప్రాయాలు ఇవ్వాలని పార్టీల ప్రతినిధులను రాణీ కుముదిని కోరారు. ఈ విషయమై ఎన్నికల నియమావళి సవరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడమా? లేక నిర్ణయం తీసుకోవాలా? అనేది త్వరలో తేలుస్తామన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 03:52 AM