Share News

Telangana Politics: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. దగ్గర పడిన ముహూర్తం..

ABN , Publish Date - Mar 26 , 2025 | 04:01 AM

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగాలని భావిస్తున్నారు. ఉగాది పండుగ రోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ వర్గాల ప్రకారం, పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదు, మరియు ఈ విస్తరణలో కొన్ని బెర్తులు పెండింగ్‌లో ఉండవచ్చని అంటున్నారు, Telangana Government Expansion After Ugaadi Festival

Telangana Politics: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ.. దగ్గర పడిన ముహూర్తం..
TG New Cabinet Ministers

  • పండుగ రోజు ప్రమాణ స్వీకారం!.. నలుగురు లేదా ఐదుగురికి అవకాశం

  • ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనారిటీ వర్గాల నుంచి

  • ఒక్కొక్కరికి క్యాబినెట్‌ విస్తరణలో చోటు

  • రాజగోపాల్‌రెడ్డికి స్థానంపై తర్జన భర్జన

  • బీసీల్లో తెరపైకి మున్నూరుకాపు సామాజికవర్గం

  • ఎస్సీల్లో వివేక్‌ వెంకటస్వామికే అవకాశం

  • మైనారిటీల్లో ఎమ్మెల్సీ ఆమెర్‌ అలీఖాన్‌కు చాన్స్‌!

  • ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్న అధిష్ఠానం

  • నాకు చాన్స్‌ వస్తుందనుకుంటున్నా: రాజగోపాల్‌

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది పండుగ రోజున.. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విస్తరణలోనూ పూర్తిస్థాయి మంత్రిమండలి ఏర్పడే అవకాశం లేదని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి సహా 12 మంది ఉన్న విషయం తెలిసిందే. పూర్తిస్థాయి క్యాబినెట్లోకి మరో ఆరుగురిని తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాజిక, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ అధిష్ఠానం.. ఈ విస్తరణలో ఒకటి, లేదా రెండు బెర్తులను పెండింగ్‌లో పెట్టనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్‌ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కనుందనే విషయంపై అధిష్ఠానం ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. ఉగాది వరకు మంచి రోజులు లేవని, ఈ నేపథ్యంలో ఉగాది రోజు కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆ రోజు కుదరని పక్షంలో.. తర్వాతి రోజు ప్రమాణ స్వీకారం ఉంటుందని చెబుతున్నాయి. కాగా, మంత్రివర్గ విస్తరణలో ఓసీ(రెడ్డి), బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ఒక్కో బెర్తును కేటాయించాలని సోమవారం ఢిల్లీలో అధిష్ఠానంతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చల్లో ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్సీకి సంబంధించి మాల సామాజికవర్గానికి చెందిన గడ్డం వివేక్‌ వెంకటస్వామి పేరే దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు.


అయితే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు మంత్రివర్గంలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వివేక్‌ వెంకటస్వామికి చోటు కల్పిస్తే ఎదురయ్యే పరిణామాలనూ అంచనా వేస్తున్నారు. బీసీల నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వాకిటి శ్రీహరి పేరు ఖరారైనట్లేనని ఇప్పటిదాకా ప్రచారంలో ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. రాష్ట్ర క్యాబినెట్లో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చోటు కల్పిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ హామీ నేపథ్యంలో.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి క్యాబినెట్లో చోటు గ్యారెంటీ అన్న ప్రచారం జరిగింది. అయితే మొదటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉన్న మున్నూరుకాపు సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు.. ఆ సామాజిక వర్గానికి చెందిన ఆది శ్రీనివా్‌సను మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న చర్చ సోమవారం నాటి సమావేశంలో జరిగినట్లు తెలుస్తోంది. అప్పుడు వాకిటి శ్రీహరికి క్యాబినెట్‌ హోదాతో విప్‌ బాధ్యతలు ఇవ్వాలన్న దానిపై చర్చించారు. ఈ రెండు అంశాలూ ప్రస్తుతం అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ఎమ్మెల్సీ ఆమెర్‌ అలీఖాన్‌ ఒక్కరే చట్టసభల్లో అందుబాటులో ఉన్నారు. ఈ వర్గం నుంచి ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదికాకుండా.. ముస్లింల నుంచి పార్టీ సీనియర్‌ నేత ఎవరినైనా క్యాబినెట్‌లోకి తీసుకుని, ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసే అంశాన్నీ పరిశీలించినట్లు సమాచారం.


రాజగోపాల్‌రెడ్డిపై తర్జన భర్జన!

రెడ్డి సామాజికవర్గం నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సుదర్శన్‌రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచీ పట్టుదలతో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడమూ ఆయనకు కలిసివస్తోంది. అయితే రెడ్డి సామాజికవర్గం నుంచే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు అధిష్ఠానం ఇచ్చిన హామీ మేరకు తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అదే సామాజికవర్గం నుంచి ఇప్పటికే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారు. పైగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. రాజగోపాల్‌రెడ్డికి స్వయానా సోదరుడు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే ఒకే జిల్లాలో, ఒకే సామాజికవర్గం నుంచి ముగ్గురు మంత్రులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అలాగే ఒక కుటుంబం నుంచీ ఇద్దరికి చోటు దక్కినట్లవుతుంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే జరగబోయే పరిణామాలనూ అధిష్ఠానం అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ రాజగోపాల్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధిష్ఠానం భావిస్తే.. ఉగాది రోజున ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు. సమీకరణాలు కుదరకపోతే ఆ బెర్తును పెండింగ్‌లో పెట్టి నలుగురికి అవకాశం ఇస్తుందంటున్నారు. కాగా, లంబాడా సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు కోసం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తమ వంతు ప్రయత్నాలు చేసుకున్నారు. వీరిలో ఒకరికి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు.


నాకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నా: రాజగోపాల్‌రెడ్డి

క్యాబినెట్‌ విస్తరణపై ఢిల్లీలో సోమవారం చర్చ సీరియ్‌సగానే జరిగినట్లుందని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తనకు మంత్రి పదవి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు. అయితే ఇప్పటివరకైతే ఢిల్లీ నుంచి తనకు ఫోన్‌ రాలేదన్నారు. హోం మంత్రిత్వ శాఖ అంటే తనకు ఇష్టమని, కెపాసిటీని బట్టి మంత్రుల ఎంపిక జరగాలని వ్యాఖ్యానించారు. అయినా.. ఏ పదవి వచ్చినా సమర్థంగా నిర్వహిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో మంగళవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

ఇది కారు లాంటి గేట్..

Hotel Booking: ఒయో రూమ్స్ కోసం ఆధార్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇలా చేయండి

Stock Market Update: స్వల్ప లాభాల్లో గట్టెక్కిన నిఫ్టీ, సెన్సెక్స్ రెడ్ లో బ్యాంక్ నిఫ్టీ

Updated Date - Mar 26 , 2025 | 08:04 AM