చివరి త్రైమాసికంలో.. 30 వేల కోట్ల అప్పు
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:13 AM
చివరి త్రైమాసికంలో సర్కారు రూ.30 వేల కోట్ల రుణానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సర్కారు ఖజానాలో రూ.10వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఐఐసీ) 400 ఎకరాలను తనఖా పెట్టి, సెక్యూరిటీ బాండ్ల ద్వారా తెచ్చిన రుణం ద్వారా సమకూర్చింది.
జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో రూ.10 వేల కోట్ల చొప్పున..
ఎఫ్‌ఆర్‌బీఎం కింద సమీకరించే అవకాశం
ఇప్పటికే టీజీఐఐసీ నుంచి రూ.10 వేల కోట్లు జమ
వీటితో ‘రైతు భరోసా’, ‘రైతు కూలీలకు భృతి’ అమలు!
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): చివరి త్రైమాసికంలో సర్కారు రూ.30 వేల కోట్ల రుణానికి సన్నద్ధమైంది. ఇప్పటికే సర్కారు ఖజానాలో రూ.10వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ మొత్తాన్ని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీజీఐఐసీ) 400 ఎకరాలను తనఖా పెట్టి, సెక్యూరిటీ బాండ్ల ద్వారా తెచ్చిన రుణం ద్వారా సమకూర్చింది. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడి ఈ నెలలో మరో రూ.10వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. ఇదే కోవలో.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో రూ.10వేల కోట్ల చొప్పున.. మొత్తం ఈ త్రైమాసికంలో రూ.30వేల కోట్ల మేర రుణాలు సేకరించనుంది. ఎఫ్‌ఆర్‌బీఎం కింద చివరి త్రైమాసికంలో ఈ రుణాలను సేకరించాలని నిర్ణయించిన సర్కారు.. ఆ మేరకు ఆర్‌బీఐకి నెలవారీ ఇండెంట్లు పెట్టింది. ఇలా ఖజానాలో చేరనున్న నిధులతో పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ నెలలో రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12వేల భృతి, సర్పంచులకు రూ.10లక్షల్లోపు బిల్లుల మంజూరుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు ఈ నెలలో యసమీకృత గురుకుల విద్యాలయాల నిర్మాణాలు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి.
రైతులకు శుభవార్త
కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానాలైన రైతు భరోసా, రైతుల కూలీలకు భృతిని అమలు చేయాలని నిర్ణయించిన సర్కారు.. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించిన విషయం తెలిసిందే. మంత్రుల బృందం విధివిధానాలను రూపొందించగా.. ఈ నెల 4న జరగనున్న క్యాబినెట్ భేటీలో వీటికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. సంక్రాతి సందర్భంగా రైతు భరోసాను అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎకరానికి రూ.15 వేల కోట్ల చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రైతులకు రూ.20 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేయాల్సి ఉంటుందని అంచనా. అంటే.. ప్రస్తుత సీజన్‌కు రూ.10 వేల కోట్లు అవసరం. అయితే.. ప్రభుత్వం విధివిధానాల్లో భాగంగా విధించే షరతుల మేరకు.. ఈ మొత్తం రూ.4,800 కోట్లకు తగ్గవచ్చని భావిస్తున్నారు. రైతు కూలీలకు భృతి విషయంలోనూ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
సర్పంచులకూ ఊరట
సర్పంచులకు సంబంధించిన అభివృద్ధి పనుల బిల్లులను కూడా రేవంత్ సర్కారు మంజూరు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 సంవత్సరం డిసెంబరు 7 నాటికి ఈ కోవలో రూ.1,300 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిల్లో రూ.10 లక్షల్లోపు ఉన్న బిల్లులను క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే వెల్లడించారు. ఈ కోవలోని బిల్లులకు రూ. 400 కోట్ల వరకు అవసరమని అంచనా. ఈనెల, వచ్చేనెలల్లో ప్రభుత్వం ఈ క్యాటగిరీలోని బిల్లులను క్లియర్ చేసే అవకాశాలున్నాయి. వీటితోపాటు.. అత్యవసర పనులు, పథకాల కోసం ప్రభుత్వం నిధులను సమీకరించేందుకు కసరత్తు చేస్తోంది.
డీఏలపై నిర్ణయానికి చాన్స్
ప్రభుత్వం ఈ నెలలో ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయాల్సిన నాలుగు కరువు భత్యాల(డీఏ) విషయంపైనా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ జనవరి 1 నుంచి ఉద్యోగులకు మరో డీఏ కూడా కలవనుంది. దీంతో.. పెండింగ్‌లో ఉండే డీఏల సంఖ్య ఐదుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులను శాంతపర్చడానికి ఒకట్రెండు డీఏలను సర్కారు ప్రకటించవచ్చని తెలుస్తోంది.
రుణాలు
ఎప్పుడెప్పుడొస్తాయంటే?
తేదీ అందనున్న రుణం
(రూ. కోట్లలో)
జనవరి 7 3000
జనవరి 14 2000
జనవరి 21 2,500
జనవరి 28 2,500
ఫిబ్రవరి 4 3000
ఫిబ్రవరి 11 2000
ఫిబ్రవరి 18 2,500
ఫిబ్రవరి 25 2,500
మార్చి 4 3000
మార్చి 11 2,500
మార్చి 18 2000
మార్చి 25 2,500