తెలంగాణను ప్రపంచానికి చూపిద్దాం!
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:34 AM
హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే ఓ గొప్ప వేదికగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
మే 18న సచివాలయంపై ‘తెలంగాణ గ్రోత్ స్టోరీ’ 3డీ షో
ట్యాంక్‌బండ్‌పై నైట్‌కార్నివాల్
మిస్ వరల్డ్ పోటీల వేళ కార్యక్రమాలు
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ వేదికగా జరగనున్న ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటే ఓ గొప్ప వేదికగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలు జరిగే సమయంలో పర్యాటక శాఖతో కలిసి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు చేస్తోంది. మే 7 నుంచి 31 వరకు మిస్ వరల్డ్ పోటీలు జరగనుండగా మే 18న హైదరాబాద్‌లోని సచివాలయం, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో నైట్ కార్నివాల్ నిర్వహించనుంది. అలాగే, తెలంగాణ గ్రోత్ స్టోరీ పేరిట రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ రోజు సాయంత్రం 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ విధానంలో సచివాలయంపై ప్రదర్శించనున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో ఎక్కడ నుంచి చూసినా ఈ ప్రదర్శన కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
నాటి నుంచి నేటి వరకు తెలంగాణ చరిత్రలో ముఖ్య విషయాలు, రాష్ట్ర ప్రగతి, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ప్రముఖ ప్రాంతాలు, వాటి విశేషాలు తెలంగాణ గ్రోత్ స్టోరీలో ఉండనున్నాయి. అలాగే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, ఇతర దేశాల నుంచి ఇప్పటికే వచ్చిన పెట్టుబడుల వివరాలు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే సుందరీమణులు, 140 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు ఈ ప్రదర్శనలను తిలకించనున్నారు. దీంతో తెలంగాణ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అవుతుందని, తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టవచ్చనేది ప్రభుత్వ ఆలోచన.