Crop Damage: పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు
ABN , Publish Date - Apr 12 , 2025 | 03:44 AM
అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పరిహారం ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం
20 వేల ఎకరాలకు పంపిణీ చేసే అవకాశం
హైదరాబాద్/అశ్వారావుపేట రూరల్ ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమాకు సంబంధించి కేంద్ర పథకం ఫసల్ బీమా యోజన తెలంగాణలో ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో రాష్ట్ర బడ్జెట్ నుంచే నష్ట పరిహారం ఇవ్వాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ యాసంగి సీజన్‌లో అకాల వర్షాలతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతుల వారీగా నివేదిక అందింది. అయితే ఈనెల మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు మరింత పంట నష్టం చోటు చేసుకుంది. 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం రాగా, రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ సర్వే పూర్తయితే మొత్తం కలిపి సుమారు 20 వేల ఎకరాల వరకు లెక్క తేలే అవకాశాలున్నాయి. 20 వేల ఎకరాలకు.. ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం పంపిణీ చేయటానికి రూ.20 కోట్ల నిధులు అవసరమవుతాయి.
అశ్వారావుపేటలో ఈదురుగాలుల బీభత్సం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో గురువారం అర్ధరాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఒకవైపు గాలులు, మరో వైపు వాన దాదాపు గంట పాటు ఏమీ జరుగుతుందో తెలియని పరిస్థితి.. నారాయణపురం, వినాయకపురం, గుర్రాలచెరువు, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటల్లో కాయలన్నీ రాలిపోయాయి. గుర్రాలచెరువు, అల్లిగూడెం ప్రాంతాల్లో కూరగాయలు సాగు దెబ్బతిన్నది. పెద్ద పెద్ద చెట్లు పడిపోవటంతో ఒక్క అశ్వారావుపేటలోనే 16 కరెంటు స్తంభాలు నేలకూలాయి. ఇతర ప్రాంతాల్లో మరో 9 కరెంటు స్తంభాలు పడిపోయాయి. పలుచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు శాఖకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. రంగంలోకి దిగిన విద్యుత్తు శాఖ అధికారులు వెంటనే పనులు చేపట్టి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
ఇవి కూడా చదవండి:
అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..
షాకింగ్ వీడియో.. తల్లీకూతుళ్లను నడిరోడ్డు మీద జుట్టు పట్టి ఈడూస్తూ..
దారుణం.. తండ్రి శవ పేటిక కింద ఇరుక్కుపోయిన తనయుడు