Suryapet: రావిపహాడ్‌లో ‘ఇథనాల్’ కంపెనీ రద్దు చేసేవరకూ పోరాటం
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:49 AM
సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌లో నిర్మిస్తున్న ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్(ఇథనాల్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు చెందిన రైతులు నెలరోజులుగా చేస్తున్న నిరసనలు రోజురోజుకూ ఉద్రిక్తమవుతున్నాయి.
అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల రిలే నిరాహారదీక్ష
నాయకులను బలవంతంగా స్టేషన్‌కు తరలించిన పోలీసులు
మోతె, జనవరి 2: సూర్యాపేట జిల్లా మోతె మండలం రావిపహాడ్‌లో నిర్మిస్తున్న ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్(ఇథనాల్) ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రద్దు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు చెందిన రైతులు నెలరోజులుగా చేస్తున్న నిరసనలు రోజురోజుకూ ఉద్రిక్తమవుతున్నాయి. కంపెనీ నిర్మాణంతో అనారోగ్యం పాలవుతామని ఆందోళన వ్యక్తం చేస్తూ వారు గురువారం కంపెనీ ఎదుట ప్రారంభించిన రిలే దీక్షలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 50మంది బెటాలియన్ పోలీసులు, ఇతర సిబ్బంది వచ్చి దీక్షలకు అనుమతి లేదంటూ టెంట్లు వేయకుండా అఖిలపక్ష నాయకులను అడ్డుకున్నారు. దాంతో వారు రోడ్డు వెంబడి దీక్ష చేపట్టారు.
దీక్షలో ఉన్న వారిని పోలీసులు, బెటాలియన్ సిబ్బంది బలవంతంగా తరలించేందుకు ప్రయత్నించగా పోలీసులు, అఖిలపక్షం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అఖిలపక్షం నాయకులను పోలీసులు మోతె పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఇథనాల్ కంపెనీ వ్యతిరేక కమిటీ జేఏసీ నాయకుడు మట్టిపెల్లి సైదులు మాట్లాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇథనాల్ కంపెనీ అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలన్నారు. అనుమతులు రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.