Telangana Assembly: స్పీకర్ తేల్చాకే..!
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:58 AM
పది మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు.

అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు
ఇందుకు అనుగుణంగా అనేక తీర్పులున్నాయి
అనర్హత కేసులో చట్టాన్ని పాటిస్తున్న స్పీకర్
పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు
స్పీకర్‌ను ఆశ్రయించిన వెంటనే కోర్టుకెక్కారు
వారి స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టేయండి
అసెంబ్లీ కార్యదర్శి కౌంటర్ దాఖలు
అనర్హత పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ
న్యూఢిల్లీ, మార్చి 24(ఆంధ్రజ్యోతి): పది మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదని, అనర్హత పిటిషన్లపై చట్టంలో పేర్కొన్న పద్ధతిని ఆయన అనుసరిస్తున్నారని శాసనసభ కార్యదర్శి సుప్రీంకోర్టుకు నివేదించారు. ఈ మేరకు సోమవారం సర్వోన్నత న్యాయస్థానంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయంలో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌లలో పస లేదని, వాటిని తిరస్కరించాలని అభ్యర్థించారు. స్పీకర్ ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేశారనడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. స్పీకర్‌కు పిటిషన్లు పెట్టుకున్న 20 రోజులకే బీఆర్‌ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారని ప్రస్తావించారు. స్పీకర్‌పై వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైనవని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని క్లాజు 6 కింద స్పీకర్‌కు ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునేందుకు పూర్తి అధికారాలున్నాయని పేర్కొన్నారు. పిటిషనర్లు తమ ఇష్టానుసారం చట్టాన్ని అన్వయించే ప్రయత్నాలు చేయడాన్ని గమనించాలని అసెంబ్లీ కార్యదర్శి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశమై 15 నెలలు కూడా పూర్తి కాలేదని, అసెంబ్లీ పదవీకాలం ముగిసేలోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోరన్న ఆరోపణల్లో పసలేదని స్పష్టం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ గవాయి, జస్టిస్ జార్జి మైస్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల స్పందించి, ఎప్పట్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారో చెప్పాలంటూ నోటీసులు పంపింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
విశేషాధికారాలున్నాయి
స్పీకర్‌కు విశేషాధికారాలు ఉన్నాయంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను అసెంబ్లీ కార్యదర్శి ఉటంకించారు. మణిపూర్ ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో 1992లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో స్పీకర్‌కే నిర్ణయం తీసుకునే విశేషాఽధికారాలున్నాయని పేర్కొన్నారని గుర్తు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకునేలోపు ఏ న్యాయపరమైన పరిష్కారానికి తావు లేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిందని ప్రస్తావించారు. స్పీకర్ అనర్హతలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ పరిష్కారానికి అవకాశం ఉన్నదని ఆయన స్పష్టం చేశారు. గోవా అసెంబ్లీ స్పీకర్ అనుసరించిన పరిష్కార ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఇదే సుప్రీంకోర్టు కొట్టేసిందని గుర్తు చేశారు. అసాధారణ పరిస్థితుల్లో తప్ప ఫిరాయింపులపై స్పీకర్‌దే తుది నిర్ణయమని సుభాష్ దేశాయ్ కేసులో ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంపై ఏం చేయాలన్న దానిపై రాజ్యాంగ బెంచ్‌కు నివేదించాలని కాలె యాదయ్య ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కూడా ఉటంకించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే, దురుద్దేశంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారని, వాస్తవాలను కోర్టు ముందు దాచి పెట్టారని చెప్పారు. ఆర్టికల్ 136 కింద సుప్రీంకోర్టు ప్రత్యేకాధికారాలు ఉపయోగించి జోక్యం చేసుకోదగ్గ కారణాలను వేటినీ పిటిషనర్లు న్యాయస్థానం ముందు ఉంచలేక పోయారని తెలిపారు. 2024 మార్చిలో దానం నాగేందర్‌పై పాడి కౌశిక్ రెడ్డి, ఏప్రిల్‌లో కడియం శ్రీహరి, వెంకటరావుపై కేపీ వివేకానంద స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేశారన్నారు. అదే నెలలో వారు హైకోర్టును కూడా ఆశ్రయించారని చెప్పారు. నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాము డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా.. హేతుబద్దమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించిందని ప్రస్తావించారు. అనంతరం ముగ్గురు ఎమ్మెల్యేలకు జనవరి 16న, ఏడుగురు ఎమ్మెల్యేలకు ఫిబ్రవరి 4న నోటీసులు పంపారని తెలిపారు. వారంతా సమయం కోరుతూ లేఖలు రాశారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News