Srisailam: ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:08 AM
‘‘శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటి దాకా 240 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఇక ముందు చుక్క నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలి.

శ్రీశైలం నుంచి చుక్క నీరూ ఇవ్వొద్దు
సాగర్ కుడి కాల్వకు నీటిని 7 వేల నుంచి
5 వేల క్యూసెక్కులకు తగ్గించండి
కృష్ణా బోర్డు ఎదుట తెలంగాణ వాదన
అత్యవసర భేటీకి మరోసారి ఏపీ డుమ్మా
తెలంగాణకు 63, ఏపీకి 55 టీఎంసీలు
రబీ సాగు ప్రణాళిక సిద్ధం చేసిన సీఈలు
నీటి కేటాయింపులపై నేడు బోర్డు నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ‘‘శ్రీశైలం జలాశయం నుంచి ఇప్పటి దాకా 240 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఇక ముందు చుక్క నీటిని తరలించకుండా ఏపీని అడ్డుకోవాలి. నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా ఆ రాష్ట్రం తీసుకుంటున్న 7వేల క్యూసెక్కులను తక్షణమే 5వేల క్యూసెక్కులకు తగ్గించేలా నిర్ణయం తీసుకోవాలి’’ అని తెలంగాణ డిమాండ్ చేసింది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లో మిగిలి ఉన్న నీటి నిల్వలను ఏపీ, తెలంగాణకు పంపిణీ చేసే అంశంపై బుధవారం జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) రెండో అత్యసవర సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ గైర్హాజరైంది. ఏపీ విజ్ఞప్తి మేరకు గురువారం ఉదయం 11 గంటలకు భేటీ నిర్వహిస్తామని కృష్ణా బోర్డు పేర్కొంది. దీనిపై తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్, అంతరాష్ట్ర నీటి వనరుల విభాగం డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, నల్లగొండ సీఈ వి.అజయ్‌కుమార్, వనపర్తి సీఈ సత్యనారాయణరెడ్డి తదితరులు కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్‌తో సమావేశమై తీవ్ర నిరసన తెలియజేశారు. ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను ఏపీ వాడుకుందని, ఇంకా అనధికారికంగా నీళ్లను తోడుకోవడానికే సమావేశానికి గైరాపజరైందని రాహుల్ బొజ్జా మండిపడ్డారు. ఒంగోలు సీఈ జలసౌధలోనే ఉన్నా... ఈ సమావేశానికి రాలేదని తప్పుబట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపును తక్షణమే నిలిపివేయాలని ఈనెల 24న(సోమవారం) జరిగిన మొదటి అత్యవసర సమావేశంలో ఏపీని కృష్ణా బోర్డు ఆదేశించినా.. మల్యాల నుంచి 660 క్యూసెక్కులు, ముచ్చుమర్రి నుంచి 1600 క్యూసెకులు కలిపి మొత్తం 2260 క్యూసెక్కులను ఏపీ తరలించిందని రాహుల్‌బొజ్జా ఫిర్యాదు చేశారు. అయితే, గురువారం జరిగే సమావేశానికి హాజరయ్యేలా ఏపీకి ఇంకో అవకాశం ఇద్దామని తెలంగాణ అధికారులకు కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ సర్దిచెప్పారు. ఆ భేటీలో రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో ఒక నిర్ణయానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక వేళ సయోధ్య కుదరకపోతే ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణకి 63... ఏపీకి 55 టీఎంసీలు
కృష్ణా బోర్డు తొలి అత్యవసర సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ తరఫున నల్లగొండ చీఫ్ ఇంజనీర్ వి.అజయ్‌కుమార్, ఏపీ తరఫున ఒంగోలు చీఫ్ ఇంజనీర్ బి.శ్యామ్‌ప్రసాద్ బుధవారం జలసౌధలో సమావేశమై ప్రస్తుత రబీలో ఇరు రాష్ట్రాలకు అవసరమైన సాగు నీటి ప్రణాళికలను సిద్ధం చేశారు. కనీస నిల్వ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 36.51 టీఎంసీలు, సాగర్‌లో 30.57 టీఎంసీలు కలిపి మొత్తం 67 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్టు నిర్థారించారు. అయితే, శ్రీశైలం నుంచి ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 13 టీఎంసీలు, సాగర్ నుంచి ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 50 టీఎంసీల నీళ్లు అవసరమని అభిప్రాయపడ్డారు. మొత్తం గా ఏపీకి 55 టీఎంసీలు, తెలంగాణకు 63 టీఎంసీలు అవసరమని సీఈల కమిటీ నిర్ణయించింది. గురువారం జరగనున్న రెండో అత్యవసర సమావేశంలో ఈ ప్రణాళికపై చర్చించి.. నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకోనుంది.