Share News

Water Management: మళ్లీ సాగునీటి సంఘాలు!

ABN , Publish Date - Jan 03 , 2025 | 03:28 AM

రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగ సంఘాల వ్యవస్థ తెరమీదికి వచ్చింది. ప్రతీ చెరువు కింద ప్రత్యేకంగా సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తోంది.

Water Management: మళ్లీ సాగునీటి సంఘాలు!

చెరువుల కింద నియమించాలని రైతు సంక్షేమ కమిషన్‌ ప్రతిపాదనలు

  • నామినేషన్‌ విధానమా? ఎన్నికలా?.. సర్కార్‌ కసరత్తు

  • మార్గదర్శకాల బాధ్యతనుకమిషన్‌కే అప్పగించిన ప్రభుత్వం

హైదరాబాద్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మళ్లీ సాగునీటి వినియోగ సంఘాల వ్యవస్థ తెరమీదికి వచ్చింది. ప్రతీ చెరువు కింద ప్రత్యేకంగా సాగునీటి సంఘాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేస్తోంది. ఈ పాలక మండళ్లను నామినేషన్‌ విధానంలో భర్తీ చేయాలా? లేక ఎన్నికల విధానంలో నియమించాలా? అనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. ఇక ప్రభుత్వమే చెరువు కింద రైతులతో సంఘాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ ప్రభుత్వాన్ని కోరింది. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేకంగా నీటిపారుదల శాఖ అధికారులు, వ్యవస్థ ఉండగా.. గత పదేళ్లపాటు చెరువుల నిర్వహణను పట్టించుకోలేదని, ఈ నేపథ్యంలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేయాలని కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్రంలో 46,531 వేలకు పైగా చెరువులు ఉన్నాయి. వాటి కింద 25.11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత ప్రభుత్వం చాలా చెరువులను భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు అనుసంధానం చేసి, వాటిని నీటితో నింపింది. అయితే చెరువుల నిర్వహణ మాత్రం నిరాశజనకంగానే ఉంది.


మిషన్‌ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ చేపట్టినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను నియమించారు. ప్రత్యేకంగా చెరువుల నిర్వహణ కోసం సాగునీటి వినియోగ సంఘాలు ఏర్పాటు చేయాలని ఈ కమిషన్‌ సర్కార్‌కు నివేదించింది. ప్రభుత్వమే చెరువుల వారీగా రైతుల వివరాలను సేకరించి, సాగు చేసే రైతులతో పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 2025 సంవత్సరాన్ని చెరువుల సంవత్సరంగా ప్రకటించి, రాష్ట్రవ్యాప్తంగా చెరువులతో పాటు వాటి తూములు, కట్టలు, కాలువలను మరమ్మతు చేసే ప్రక్రియ చేపట్టాలని రైతు కమిషన్‌ సర్కారుకు ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రంలో కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌ జాహీల కాలంలో ఉన్న గొలుసు కట్టు చెరువుల విధానం దెబ్బతిందని, చెరువుల ప్రాంతాలు అక్రమణలకు గురయ్యాయని రైతు కమిషన్‌ పేర్కొంది. పలు ప్రాంతాల్లో చెరువులను అక్రమించి లేఔట్లు వేశారని, చెరువులకు నీటిని తీసుకెళ్లే కాలువలు కూడా ఆక్రమణకు గురయ్యాయని, ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ, రక్షణ, మరమ్మతులు వంటి కార్యకలాపాలు చేపట్టడానికి 2025 సంవత్సరాన్ని చిన్న నీటిపారుదల సంవత్సరంగా ప్రకటించాలని కోరింది. అయితే, సాగునీటి సంఘాల ఏర్పాటుపై మరింత కసరత్తు చేసి, తుది మార్గదర్శకాలు రూపొందించి నివేదికను అందించాలని రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డికి ప్రభుత్వం సూచించినట్లు సమాచారం.


  • చెరువులను రక్షించుకోవాలి

రాష్ట్రంలోని చెరువుల రక్షణ కోసం సాగునీటి వినియోగ సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. చెరువుల వారీగా సాగు చేసే రైతుల వివరాలు సేకరించి, ప్రభుత్వం పాలకమండళ్లను నియమించాలి. చెరువుల పునరుద్ధరణ కోసం 2025ను మైనర్‌ ఇరిగేషన్‌ ఇయర్‌గా ప్రకటించాలని కోరాం. కర్ణాటకలో ఈ విధానం సఫలీకృతమయింది. చెరువుల నిర్వహణకు సాగునీటి సంఘాలు ఉపయుక్తంగా ఉంటాయి.

-కోదండరెడ్డి, చైర్మన్‌, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌

Updated Date - Jan 03 , 2025 | 03:28 AM