Komati Reddy Venkat Reddy: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం!
ABN , Publish Date - Mar 25 , 2025 | 03:32 AM
రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్ 2024-25 కోసం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. 8,128 కేంద్రాలు ఏర్పాటు చేసి, 137 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకుంది. అంగీకరించిన కనీస మద్దతు ధరతో పాటు, సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చే అంశం ప్రకటనైంది.

రాష్ట్రవ్యాప్తంగా 8,128 కొనుగోలు కేంద్రాలు
హైదరాబాద్, నల్లగొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,128 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ, పౌరసరఫరాలశాఖల అధికారులు ఇచ్చే నివేదికలకు అనుగుణంగా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి జిల్లా కలెక్టర్‌లకు అధికారం ఇచ్చింది. యాసంగి (2024-25) సీజన్‌లో 137 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో 60/ 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం యాసంగిలో 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
ఏ-గ్రేడ్ రకం క్వింటాల్ ధాన్యానికి రూ.2,320 కాగా, సాధారణ రకం క్వింటాల్ ధాన్యానికి రూ.2,300 కనీస మద్దతు ధర ఉంది. సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ కలిపి చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రైతులు తీసుకొచ్చిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన 8,128 కొనుగోలు కేంద్రాల్లో.. ప్రాథమిక సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 4,455, స్వయం సహాయ సంఘాలు 3,084, మెప్మా 679 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో నల్లగొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండలోని ఆర్జాల బావి వద్ద ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభిస్తూ ధాన్యం విక్రయాల్లో రైతులు ఇబ్బంది పడొద్దన్నారు. ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు చేస్తామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News