Contract Employees: ఇంటికి పంపిన వాళ్లలో 2 వేల మందికి మళ్లీ చాన్స్?
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:49 AM
ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్ఠవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినా విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
తొలగించిన రిటైర్డ్ సిబ్బంది కోసం విభాగాధిపతుల పట్టు
6,729 మందిలో 2 వేల మందిని తీసుకునేందుకు ఒత్తిళ్లు
కొత్తవారికి అవకాశాలు ఇవ్వరా? నిరుద్యోగుల్లో అసంతృప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ విరమణ తర్వాత కూడా కాంట్రాక్టు పద్ధతిలో ప్రభుత్వ విభాగాల్లో ఏళ్లుగా తిష్ఠవేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించినా విభాగాధిపతులు మాత్రం వారిలో కొందరిని తీసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా వివిధ స్థాయుల్లో కొనసాగుతున్న 6,729 మందిని తొలగిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే నెల తిరక్కుండానే వారిలో 2వేలమందిని తిరిగి తీసుకునేందుకు కొందరు విభాగాధిపతులు చక్రం తిప్పుతున్నారు. కొన్ని కీలకశాఖల కార్యదర్శులు వీరి కోసం పట్టుబట్టి కూర్చోవడం అధికారవర్గాల్లో చర్చనీయాశంగా మారింది. తొలగించిన వారి స్థానంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు తొలగించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు కార్పొరేషన్లు, పంచాయతీరాజ్, నీటిపారుదలశాఖ, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖల్లో ఉన్నారు. పురపాలక శాఖలో 177 మందిని, పరిశ్రమల శాఖలో 179 మందిని తొలగించారు. సుమారు 6,729 మందిని తొలగించకముందు వారి జీతభత్యాలు ఇతర ఖర్చుల కోసం సర్కారు నెలకు రూ.70 కోట్ల వరకు ఖర్చు చేసేది. ఏటా రూ.840 కోట్ల వీరి వేతనాల కిందనే వెచ్చించాల్సి వచ్చేది. సదరు ఖాళీలను భర్తీ చేస్తే.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినట్లవుతుందని సర్కారు ఆలోచన చేస్తోంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగ విరమణ చేసిన వారినే ఏళ్లుగా కొనసాగించడంపై అటు నిరుద్యోగుల్లోనూ అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితిని గుర్తించిన రేవంత్ సర్కారు.. ఒకవైపు ఖాళీలను భర్తీ చేస్తూనే.. మరోవైపు కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతున్న ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల స్థానంలోనూ కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
ఈనెలాఖరులోపే నియామక ఉత్తర్వులు?
తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని మళ్లీ తీసుకునేందుకు కొందరు కార్యదర్శులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సుమారు 2 వేల మందికి మరోసారి అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు పలు విభాగాల కార్యదర్శుల నుంచి ప్రభుత్వానికి చేరాయి. కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకాలు చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈ ఏడాది జనవరిలో ఒక ఉత్తర్వు జారీ చేశారు. అందులో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి తాత్కాలిక నియామకాలు చేయొద్దని, ఇది అన్ని శాఖలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. తాత్కాలిక నియామకాల కోసం ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా ఉండాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే ఇవేమీపట్టని కొన్ని కీలక శాఖల కార్యదర్శులు.. వారికి నచ్చిన వారిని మళ్లీ తీసుకొచ్చేందుకు తెరవెనుక సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి లేకుండా కొంతమందిని నియమించగా.. ఇదేబాటలో మరికొంత మందికి ఈ నెలాఖరులోపు నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు కొన్ని శాఖల విభాగాధిపతులు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే నియామకాలపై స్పష్టత వస్తుందని సదరు ఉద్యోగులకు కార్యదర్శులు భరసా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: ఫోర్త్ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి
Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా
Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!
Read Latest Telangana News And Telugu News