CM Revanth Reddy: దావోస్ ధమాకా!
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:52 AM
దావోస్‌లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది.

దుమ్మురేపిన తెలంగాణ బృందం.. 1.78 లక్షల కోట్ల ఒప్పందాలు
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు
చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు
వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి కొలువులు
డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్స్ సంస్థలు
ఈ మూడు కంపెనీల పెట్టుబడి రూ.24,500 కోట్లు
విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే.. 22 వేల ఉద్యోగాలు
సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఎక్స్‌లెన్స్ సెంటర్
హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ
నాలుగు రోజుల్లో 20 సంస్థలతో సర్కారు ఒప్పందాలు
నిరుటితో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా పెట్టుబడులు
ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా ఎంతో సంతృప్తి
బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయమిది
ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్
మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులకు అభినందనలు
ముగిసిన దావోస్ పర్యటన.. నేడు రాష్ట్రానికి తిరిగి రాక
ముగింపు ఇలా..
అమెజాన్
రూ.60,000 కోట్లు
టిల్మాన్ గ్లోబల్స్ డేటా సెంటర్
రూ.15,000 కోట్లు
మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్
రూ.7,000 కోట్లు
ఉర్సా క్లస్టర్స్ ఏఐ డేటా సెంటర్
రూ.5,000 కోట్లు
బ్లాక్ స్టోన్ డేటా సెంటర్
రూ.4,500 కోట్లు
హైదరాబాద్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): దావోస్‌లో తెలంగాణ దుమ్మురేపింది! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం సరికొత్త రికార్డులు సృష్టించింది! రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈసారి ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటితో కొత్తగా 49,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి! స్విట్జర్లాండ్‌లోని దావో్‌సలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర ఉన్నతాధికారుల బృందం ఊహించిన దానికంటే ఎక్కువ పెట్టుబడులు సాధించింది. గత ఏడాది తొలిసారిగా దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రెట్లకు మించి పెట్టుబడులకు ఒప్పందాలు జరగడం విశేషం. ‘‘దావోస్ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాం. వీటితో 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
ఇది ‘బ్రాండ్ తెలంగాణ’ సాధించిన అద్భుతమైన విజయం’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. దావో్‌సలోనే గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో వీటినిబట్టి అంచనా వేయవచ్చని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఒప్పందాలు సాధించడానికి శ్రమించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం చేసిన ఈ పర్యటన ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు. గత ప్రభుత్వంలా కేవలం ఒప్పందాలు కుదుర్చుకోవడం వరకే తాము పరిమితం కాబోమని, కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చేంతవరకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. కాగా వారం రోజులుగా సింగపూర్, దావోస్ పర్యటనల్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం రాష్ట్రానికి తిరిగి పయనమైంది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది. కాగా, తెలంగాణ బృందం చివరి రోజు గురువారం అనేక అంతర్జాతీయ కంపెనీలతో భారీ ఒప్పందాలు కుదుర్చుకుంది.
అమెజాన్ రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌లో రూ.60 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెజాన్ ఇప్పటికే నగరంలో మూడు డేటా సెంటర్లను నిర్మించింది. అవి ఇప్పటికే పనిచేస్తున్నాయి. విస్తరణలో భాగంగా మరిన్ని నెలకొల్పనుంది. దావోస్ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంఖే భేటీ అయ్యారు. దాదాపు రూ.60,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లోని తమ అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్లను పెద్ద ఎత్తున విస్తరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అభ్యర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాగా, తెలంగాణలో 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడతామని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది.
15 వేల కోట్లతో టిల్మాన్ గ్లోబల్స్ డేటా సెంటర్
హైదరాబాద్‌లో అత్యాధునిక డేటా సెంటర్‌ను అభివృద్ధి చేసేందుకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులతో 300 మెగావాట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రెసిడెంట్ సచిత్ అహూజాతో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా అహూజా మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న మౌలిక సదుపాయాలు, దార్శనిక నాయకత్వం తమను ఆకట్టుకున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామి కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే, అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ అనుబంధ కంపెనీ అక్షత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ రాష్ట్రంలో 6.9 గిగావాట్ల సోలార్ సెల్స్; 6.9 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టుపై రూ.7,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా, దాదాపు 2,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. స్థానికంగా మరింత మందికి ఉపాధి లభిస్తుంది. సదస్సులో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల సమక్షంలో అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా గ్రూప్) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీశ్ గెల్లి సమావేశానికి ప్రాతినిధ్యం వహించారు.
రూ.5 వేల కోట్లతో ఏఐ డేటా సెంటర్
అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ ఆర్టిఫిషియల్ డేటా సెంటర్ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. కంపెనీ సీవోవో సతీశ్ అబ్బూరి, సీఆర్వో ఎరిక్ వార్నర్ దీనిపై సంతకం చేశారు. హైదరాబాద్‌లో 100మెగావాట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని కంపెనీ సీఈవో పెందుర్తి అన్నారు. ఇందులో హైబ్రిడ్ ఏఐ చిప్‌లను ఉపయోగిస్తామని, ప్రాజెక్టుపై రూ.5000 కోట్లు వెచ్చిస్తామని ప్రకటించారు. డేటా సెంటర్ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ అయిన బ్లాక్ స్టోన్ హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు రూ.4,500కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇంధన సామర్థ్యం, శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రొటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలను ఈ సెంటర్ అందిస్తుంది.
గోపనపల్లి విప్రో కొత్త క్యాంపస్
హైదరాబాద్‌లో తమ క్యాంప్‌సను విస్తరించనున్నట్లు విప్రో కంపెనీ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్తగా మరో ఐటీ సెంటర్ నెలకొల్పనుంది. దీంతో అదనంగా 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. సదస్సులో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుతో విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ సమావేశమయ్యారు. అనంతరం కీలక ప్రకటన విడుదల చేశారు. కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేండ్లలో పూర్తవుతుంది. విప్రోలాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కొత్త అవకాశాలు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం తమకు ఉత్సాహంగా ఉందని ప్రేమ్‌జీ అన్నారు. కాగా, స్కిల్స్ యూనివర్సిటీతోపాటు వివిధ నైపుణ్యాభివృద్థి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి శ్రీధర్ బాబు విప్రో కంపెనీని ఆహ్వానించారు.
రైతులకు సుహానా మసాలా శిక్షణ
సంగారెడ్డిలో ప్రస్తుతమున్న తమ ప్లాంట్ పక్కనే కొత్తగా ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను నెలకొల్పుతామని, ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా సుగంధ ద్రవ్యాల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామని సుహానా సంస్థ ప్రకటించింది. సంస్థ డైరెక్టర్ ఆనంద్ చోర్డియా సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. రాబోయే రెండు మూడేండ్లలో ఈ సెంటర్ ద్వారా 25 వేల నుంచి 30 వేల మంది రైతులకు శిక్షణనిస్తామని, సుగంధ ద్రవ్యాల నాణ్యత మరియు వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించే నైపుణ్యాలు అందిస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో ఎక్లాట్ హెల్త్ విస్తరణ
ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ రాష్ట్రంలో మరో ఆఫీసు ఏర్పాటు చేయనుంది. దాదాపు 800 మంది ఉద్యోగులకు సదుపాయముండేలా దీన్ని నెలకొల్పుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌నాటికే ఇది పని చేయడం ప్రారంభిస్తుంది. సదస్సులో మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులతో ఎక్లాట్ కంపెనీ సీఈవో కార్తీక్ పోల్సాని సమావేశమయ్యారు. రాష్ట్రంలో కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించారు. వాషింగ్టన్ డీసీలో ప్రధాన కార్యాలయమున్న ఎక్లాట్ హెల్త్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,000 మందికిపైగా నిపుణులను నియమించింది.
ఇన్ఫోసిస్ విస్తరణతో 17 వేల ఉద్యోగాలు
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్‌లో తమ ఐటీ క్యాంప్‌సను విస్తరించనుంది. పోచారంలో ఉన్న క్యాంప్‌సలో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అక్కడ సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సదస్సులో ఇన్ఫోసిస్ సీఎ్‌ఫవో జయేశ్ సంగ్రాజ్కా మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. అనంతరం మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడతామని, వచ్చే రెండు మూడేండ్లలో దీని నిర్మాణం పూర్తవుతుందని ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు దేశంలో ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇప్పటికే ఇన్ఫోసిస్ హైదరాబాద్ కార్యాలయాల్లో దాదాపు 35 వేల మంది ఉద్యోగులున్నారు.
కంపెనీ పరిశ్రమ పెట్టుబడుల విలువ
యూనీలివర్ ఆయిల్‌పామ్ శుద్ధి ప్రకటించలేదు
హెచ్‌సీఎల్ టెక్ కొత్త ఐటీ క్యాంపస్ ప్రకటించలేదు
అగిలిటీ వ్యవసాయ టెక్నాలజీ హబ్ 400
సిఫీ టెక్నాలజీస్ వరంగల్‌లో 200 మె.వా. డేటా సెంటర్ 10,000
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ల తయారీ, ప్రయోగ కేంద్రం 500
కంట్రోల్ ఎస్ 400 మె.వా. డేటా సెంటర్ 10,000
మేఘా ఇంజినీరింగ్ 1 గి.వా. ఎనర్జీ స్టోరేజ్, 15,000
2000 మె.వా. పంప్ స్టోరేజ్
ఫోనిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ 250
ఉర్సా క్లస్టర్స్ డేటా సెంటర్ 5,000
అమేజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ల విస్తరణ 60,000
రామ్కీ గ్రూప్ డ్రై పోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్ 5,000
ఇన్ఫోసిస్ పోచారంలో కొత్త ఐటీ క్యాంపస్ విస్తరణ ప్రకటించలేదు
విప్రో గోపనపల్లిలో కొత్త ఐటీ క్యాంపస్ విస్తరణ ప్రకటించలేదు
సుహానా మసాలా పసుపు పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రకటించలేదు
సన్ పెట్రోకెమికల్స్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 45,500
జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ యూఏవీ మ్యానుఫ్యాక్చరింగ్ 800
జేసీకే గ్రూప్ డేటా సెంటర్ 4,500
తిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ డేటా సెంటర్ 15,000
మిత్రా ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ యూనిట్ 7,000
ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ఐటీ విస్తరణ ప్రకటించలేదు
మొత్తం 1,78,950