Ponnam Prabhakar: 26 నుంచి రైతుభరోసా: మంత్రి పొన్నం
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:43 AM
జనవరి 26 నుంచిరాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.
అక్కన్నపేట/హుస్నాబాద్, జనవరి6(ఆంధ్రజ్యోతి): జనవరి 26 నుంచిరాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో రూ.25 కోట్లతో చేపట్టే హుస్నాబాద్-రామవరం డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడారు. హుస్నాబాద్‌లోనూ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వ్యవసాయ యోగ్యమైన భూములకు ఏడాదికి రెండు దఫాలుగా ఎకరానికి రూ.12వేలు రైతుల అకౌంట్‌లో జమ చేస్తామని చెప్పారు. గుట్టలు, రాళ్లు రప్పలు, రోడ్లు, నాలా కన్వెన్షన్ ఉన్న భూములకు రైతు భరోసా పథకం వర్తించదని స్పష్టం చేశారు. భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ కానుక కింద రూ.12వేలు అందజేస్తామని తెలిపారు. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు.