Share News

Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:35 AM

రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి.

Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

  • ముందున్న లారీ కనిపించక కారు ఢీ

  • మరో కుమార్తె, భర్తతో పాటు బంధువులకు గాయాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

భువన గిరి రూరల్‌/ కేసముద్రం(మహబూబాబాద్‌ జిల్లా), జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రహదారి కనిపించనంతగా కమ్మేసిన పొగమంచు తల్లీకుమార్తెను బలితీసుకుంది. యాదాద్రిభువనగిరి సమీపంలో వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై గురువారం ఉదయం పొగమంచు కమ్మేయడంతో ముందున్న లారీ కనిపించక కారు ఢీకొనడంతో తల్లీ చిన్నకుమార్తె మృతి చెందగా భర్త, పెద్ద కుమార్తెతో పాటు బంధువులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం గాంధీపురం పరిధి వెంకట్రాంతండాకు చెందిన భూక్య సంతోష్‌ కుటుంబంతో హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిస్తున్నాడు. సంక్రాంతికి కుటుంబంతో స్వగ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా దట్టమైన పొగమంచు కారణంగా మార్గమధ్యలో భువనగిరి సమీపంలోని రాయిగిరి వద్ద వీరి కారు ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది.


ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న సంతోష్‌ భార్య అనూష (28), చిన్న కుమార్తె చైత్ర (7) మృతి చెందగా సంతో్‌షతో పాటు పెద్ద కుమార్తె భూక్య ప్రణశ్విని, సంతోష్‌ సోదరి భవాని, ఆమె భర్త రవి, కుమార్తె మోక్షకు గాయాలయ్యాయి. లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో అందులోంచి క్షతగాత్రులను బయటకు తీయడానికి పోలీసులకు అరగంటకుపైగా సమయం పట్టడంతో వారు నరకయాతన అనుభవించారు. అనంతరం వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అనూష, చైత్ర మృతదేహాలను పోస్టుమార్టం ముగిసిన తర్వాత బంధువులకు అప్పగించారు. ఈ ఘటనతో వెంకట్రాంతండ, అనూష పుట్టినిల్లు లచ్చీరాంతండాల్లో విషాద ఛాయ లు అలుముకున్నాయి. సంక్రాంతి సెలవుల్లో తమతో సరదాగా గడిపి వెళ్లిన అనూష, చైత్ర మృతిచెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Jan 17 , 2025 | 04:35 AM