Share News

Tourist Attractions: ములుగు.. పర్యాటక వెలుగు

ABN , Publish Date - Jan 02 , 2025 | 05:10 AM

ఏడాదికోసారైనా అలా ఓ హాలిడే ట్రిప్‌ వేసి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికి ఏ విదేశానికో.. బయట రాష్ట్రానికో వెళ్లనవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం!

Tourist Attractions: ములుగు.. పర్యాటక వెలుగు

పర్యాటక స్థలంగా లక్నవరం చెరువులో 12 ఎకరాల దీవి అభివృద్ధి.. స్విమ్మింగ్‌ పూల్స్‌, వాటర్‌ గేమ్స్‌, బోటింగ్‌

  • కొద్ది దూరంలో జలగలంచ వద్ద గోవా మాదిరిగా బ్లాక్‌బెర్రీ ఐల్యాండ్‌

  • ఇసుక తిన్నెల్లో గుడారాలు, రెస్టారెంట్లు

  • మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో

  • బొగత జలపాతం, మేడారం, మల్లూరు, రామప్ప అభివృద్ధికి కూడా ప్రణాళిక

ములుగు, జనవరి 1(ఆంధ్రజ్యోతి): ఏడాదికోసారైనా అలా ఓ హాలిడే ట్రిప్‌ వేసి ప్రకృతి ఒడిలో సేదతీరాలని ఎవరికి మాత్రం ఉండదు? దీనికి ఏ విదేశానికో.. బయట రాష్ట్రానికో వెళ్లనవసరం లేకుండా మన తెలంగాణలోనే గొప్ప పర్యాటక అనుభూతి పొందేందుకు గొప్ప అవకాశం! అదే ములుగు అభయారణ్యం! ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని లక్నవరం చెరువులోని మూడు దీవుల్లో ఒక దీవిని రాష్ట్ట్ర పర్యాటక శాఖ ఓ ప్రైవేటు కంపెనీతో కలిసి అభివృద్ధి చేసింది. దీనికి మూడో దీవి (థర్డ్‌ ఐలెండ్‌) అని పేరు. ఈ దీవిని ఐదేళ్ల లీజుకు తీసుకున్న కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దింది. లేక్‌వ్యూ కాటేజీలు, స్విమ్మింగ్‌ పుల్స్‌, వాటర్‌ గేమ్స్‌, తీరొక్క బోట్లలో రైడింగ్‌, కోరుకున్న వంటకాలు, డ్రింక్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. సముద్ర తీర పర్యాటక ప్రాంతాల మాదిరిగానే గొప్ప పర్యాటక స్థలిగా ఈ దీవిని తీర్చిదిద్దారు. లక్షలు వెచ్చించి ఎక్కడికో వెళ్లే బదులు సమీపంలో ఉన్న లక్నవరం వచ్చేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడాది వేడుకల కోసం పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకున్నారు.

33.jpg


లక్నవరానికి 12 కి.మీ దూరంలో తాడ్వాయి మండలంలోనే దట్టమైన ఆటవీ ప్రాంతంలో మరో పర్యాటక ప్రదేశం సిద్ధమవుతోంది. అదే బ్లాక్‌బెర్రీ ఐలెండ్‌. జలగలంచ వాగు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెలు, నేరేడు చెట్లు, కంక(వెదురు) వనంతో అందంగా అల్లుకున్న ప్రదేశమిది. పూర్తిగా ఎకో ఫ్రెండ్లీగా ఐదెకరాల విస్తీర్ణంలోని ఈ దీవిని అభివృద్ధి చేశారు. వెదురు కర్రలతో మంచెలు, 50కిపైగా గుడారాలు, ఇసుకలో వాలీబాల్‌ కోర్టు, ఓపెన్‌ రెస్టారెంట్‌లు, సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. గోవా తీరంలో మాదిరిగా లైటింగ్‌తో సుందరంగా అలంకరించారు. అడవి మధ్యలో రాత్రివేళ ఇక్కడ సేదతీరడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని మిగల్చనుంది. ట్రెకింగ్‌, బర్డ్‌వాచ్‌, సఫారీ రైడింగ్‌ కోసం అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పబ్లిక్‌, ప్రైవేటు సెక్టార్‌లో ఈ రెండు ప్రాజెక్టులు విజయవంతం కావడంతో వాజేడు మండలంలోని బొగత జలపాతం, మేడారం, మల్లూరు, రామప్పలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 365 రోజులు ఇక్కడికి పర్యాటకులు వచ్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఆలోచన చేస్తోంది.


టూరిజానికి కేంద్రం నిధులు

గత మూడేళ్లలో ములుగు జిల్లాకు కోటిన్నర మంది పర్యాకులు వచ్చినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవల ప్రకటించింది. రామప్ప, లక్నవరం, మేడారానికి కోట్లలో ఆదాయం సమకూరింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి రామప్ప ప్రాంత పర్యావరణ హిత పర్యాటక కార్యక్రమం కింద రూ.73.74 కోట్ల నిధులను కేటాయించింది. పర్యాటకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో పలు కంపెనీలు ములుగు జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.

33.jpg


ప్రైవేటు రిసార్టులు, లాడ్జిలు

గత ప్రభుత్వం ములుగు, రామప్ప, లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగత వద్ద హరిత హోటళ్లను నిర్మించి నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. వీకెండ్‌లు, హాలీడేలలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఇవి సరిపోవడం లేదు. ప్రైవేటు రిసార్టులు ఏర్పాటు చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే లక్నవరం, మేడారం వెళ్లేదారిలో రిసార్టులు అందుబాటులోకి రాగా రామప్పలో సిద్ధమవుతున్నాయి. వీటిలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. మేడారం, బుస్సాపూర్‌ వద్ద కొందరు విశ్రాంతి గదులను కూడా ఏర్పాటుచేసి కిరాయికి ఇస్తున్నారు. సీజన్‌లతో సంబంధం లేకుండా వీటికి గిరాకీ వస్తోంది. జిల్లా కేంద్రంతోపాటు జాతీయ రహదారిపై ఉన్న మండలకేంద్రాల్లో ఏసీ, నాన్‌ ఏసీ సదుపాయాలతో లాడ్జిలు కూడా వెలుస్తున్నాయి.

33.jpg

Updated Date - Jan 02 , 2025 | 05:10 AM