Share News

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:34 AM

ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!!

Shocking Incident: ఇంట్లో తల్లి మృతదేహం చెంత 9 రోజులు!

  • ఆమె హఠాన్మరణంతో షాక్‌లోకి ఇద్దరు కుమార్తెలు

  • మణికట్టు, గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం

  • మూడు రోజులు స్పృహ కోల్పోయిన అమ్మాయిలు

  • ఆ తర్వాత డిప్రెషన్‌తో మృతదేహం చెంతే..

  • ఇన్నాళ్లు డోర్లు క్లోజ్‌.. దుర్వాసన పెరగడంతోనే బయటకు

  • స్థానిక నేతను కలిసి అంత్యక్రియలకు సాయం కోరిన వైనం.. ఘటనపై అనుమానాలు

బౌద్ధనగర్‌, జనవరి31 (ఆంధ్రజ్యోతి): ఆ తల్లికి ఇద్దరు కూతుళ్లు.. ఆ కూతుళ్లకు ఆ తల్లి ! ముగ్గురే ఓ లోకంగా బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేకుండా బతుకుతున్నారు. ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉండటంతో స్థానికులకు ఏమాత్రం అనుమానం రాలేదు. ఆ ఇంట్లో తల్లి చనిపోయిందని.. తొమ్మిది రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉందని.. ఎవ్వరికీ తెలియదు! మృతదేహం నుంచి దుర్వాసన వస్తున్నా.. కుళ్లిపోయి పురుగులు పడుతున్నా తొమ్మిది రోజుల పాటు ఇద్దరమ్మాయిలు మృతదేహంతోనే సావాసం చేశారనీ తెలియదు!! ఆ ఇద్దరు తలుపులు మూసేసుకొని ఇంట్లో ఉన్నదేదో తింటూ.. రాత్రుళ్లు తల్లి మృతదేహం పక్కనే నిద్రిస్తూ గడిపారు. చివరికి వారే ఇంట్లోంచి బయటకొచ్చి ‘మా అమ్మ చనిపోయింది’ అని చెప్పారు. వారాసిగూడ బౌద్ధనగర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆలోచనల్లో పడేసింది. అప్పటిదాకా చక్కగా ఉన్న తల్లి హఠాత్తుగా చనిపోవడం జీర్ణించుకోలేక అమ్మాయిలు షాక్‌కు గురై ఎటూ పాలుపోని స్థితిలో ఇన్నాళ్లు ఇంట్లోనే మృతదేహంతో ఉండిపోయారని పోలీసులు అంచనాకొచ్చారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలి పేరు లలిత(45). ఈమె భర్త పేరు సీఎల్‌ రాజు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. లలిత-రాజు దంపతులకు కూతుళ్లు రవళ్లిక(25), యశ్విత(22) ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఇంట్లో గొడవలు జరగడంతో రాజు భార్యాపిల్లలను, ఉద్యోగాన్ని వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. అమ్మాయిలకు మేనమామ రమేశ్‌ ఉన్నా ఆ కుటుంబంతో గొడవలు జరగడంతో మూడేళ్ల క్రితం సంబంధాలు తెగిపోయాయి. రవళ్లిక, యశ్విత పదో తరగతి దాకా చదివి మానేశారు. రవళ్లిక ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో, యశ్విత ఓ బట్టల షాపులో పనిచేస్తున్నారు. రాజు ఓయూ ఉద్యోగి కావడంతో ఈ కుటుంబం అక్కడి క్వార్టర్స్‌లోనే ఉండేది.


అక్కడి అధికారులు క్వార్టర్స్‌ ఖాళీ చేయాలని చెప్పడంతో రెణ్నెళ్ల క్రితమే లలిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బౌద్ధనగర్‌కు వచ్చి.. ఓ భవనం మూడో ఫ్లోర్‌లో అద్దెకు ఉంటోంది. అమ్మాయిలకు వచ్చే అరకొర జీతమే ఆధారం కావడంతో ఈ కుటుంబం ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. జనవరి 22న రాత్రి ముగ్గురు భోజనాలు చేసి నిద్రపోయారు. ఉదయం లలిత ఎంతసేపటికి నిద్రలేవకపోవడంతో తల్లిని లేపేందుకు అమ్మాయిలు ప్రయత్నించి.. చనిపోయిందని తెలుసుకున్నారు. తల్లిలేని జీవితం ఎందుకనే విరక్తితో రవళ్లిక, యశ్విత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కత్తితో మణికట్టు, గొంతు కోసుకున్నారు. రక్తం బాగా పోవడంతో స్పృహ కోల్పోయినట్లుగా చెబుతున్నారు. మూడు రోజుల తర్వాత స్పృహలోకొచ్చినా కూడా డిప్రెషన్‌తో ఇంటి తలుపులు తెరవకుండా లోపలే ఉండిపోయారు. రోజులు గడుస్తున్న కొద్దీ మృతదేహం కుళ్లిపోయి, దుర్వాసన పెరుగుతుండటంతో భరించలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకొచ్చారు. స్థానికుల సూచనతో సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న బీఆర్‌ఎస్‌ నాయకుడు జి.చంద్రశేఖర్‌ను కలిశారు. తమ తల్లి తొమ్మిది రోజుల క్రితం చనిపోయిందని.. అప్పటి నుంచి మృతదేహం ఇంట్లోనే ఉందని, దహన సంస్కారాలకు సాయం చేయాలని కోరారు. వారి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండటం.. ఇద్దరికీ గొంతు, మణికట్టు వద్ద గాయాలండటాన్ని గమనించిన ఆయన వారాసిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్‌ టీమ్‌తో కలిసి చిలకలగూడ డివిజన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డి ఘటనాస్థలికి వెళ్లారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


కూతుళ్ల వద్ద ఆగిన డాగ్‌స్క్వాడ్స్‌

ఈ ఘటనకు సంబందించి మృతురాలు లలిత సోదరుడు, బ్యాంక్‌ మేనేజర్‌ అయిన రమేశ్‌ను పోలీసులు పిలిపించారు. అయితే ఈ కుటుంబం ఎవ్వరితో సఖ్యతగా ఉండరని, మనస్పర్థలు ఏర్పడటంతో కొన్నాళ్లుగా మాట్లాడటం లేదని ఆయన చెప్పారు. ఈ విషాదంలో అమ్మాయిల పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని ఆయనకు పోలీసులు సూచించారు. తల్లి చనిపోయిన షాక్‌లోకి వెళ్లడంతోనే ఇన్నాళ్లుగా కూతుళ్లు మృతదేహం వద్ద ఉండిపోయారని ఏసీపీ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాగ్‌ స్క్వాడ్స్‌ కూతుళ్లు రవళ్లిక, యశ్విత వద్దకు వెళ్లి ఆగిపోయాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఘటనపై స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు.


ఇవీ చదవండి:

సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 03:34 AM