Share News

Encounter: రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:00 AM

మావోయిస్టు నేత రేణుక అలియాస్‌ భాను, సుధీర్‌లది బూటకపు ఎన్కౌంటర్ అని పోలీసులే ఇంట్లో నుంచి తీసుకెళ్లి హత్య చేశారంటూ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఓ లేఖలో పేర్కొంది. వారు అనారోగ్యం కారణంగా బీజాపూర్‌ జిల్లా బెల్నార్‌లోని ఓ ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకుని పోలీసు బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టి అరెస్టు చేశాయన్నారు.

Encounter: రేణుక, సుధీర్‌లది బూటకపు ఎన్‌కౌంటర్:మావోయిస్టు పార్టీ
Maoist Party Letter

జనగామ: మావోయిస్టు పార్టీ ( Maoist Party) ఆగ్రనేతలు (Maoist Leaders) రేణుక (Renuka), సుధీర్‌ (Sudheer)లది బూటకపు ఎన్కౌంటర్ (Fake encounter) అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. అగ్రనేతలు ఇద్దరినీ కూడా ఇంద్రావతి నది వద్ద పోలీసులు (Police) పట్టుకున్నారని, రేణుక, సుధీర్ ఇద్దరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. ఇంద్రావతి నది ఒడ్డున పట్టుకొని విచారించి, హింసించి, హత్య చేశారని ఆరోపించారు. 35 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో ఇద్దరూ కీలక పాత్ర పోషించారని మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ (Letter) విడుదల చేసింది.

Also Read..: భద్రాద్రిలో గరుడ ధ్వజ పట లేఖనం


రేణుక ఎన్‌కౌంటర్..

ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లా భైరాంఘర్‌ పరిధిలోని బాజీపూర్‌ బార్డర్‌ నెల్‌గోడా వద్ద సోమవారం (మార్చి 31) జరిగిన ఎన్‌కౌంటర్‌లో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక అలియాస్‌ భాను అలియాస్‌ చైతీ అలియాస్‌ సరస్వతి మృతి చెందింది. కడవెండికి చెందిన గుమ్మడవెల్లి సోమయ్య- జయమ్మ దంపతుల కుమార్తె రేణుక. అన్న గుమ్మడవెల్లి వెంకటకృష్ణప్రసాద్‌ మావోయిస్ట్‌ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసి లొంగిపోయారు. 1996లో ఆమె మావో యిస్టు పార్టీలో చేరారు. అలిపిరిలో చంద్రబాబు బాంబ్‌ బ్లాస్ట్‌ ఘటన అనంతరం నిర్బంధం పెరగడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రేణుక 2005లో సెంట్రల్‌ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావును వివాహం చేసుకుంది. అతను 2010లో నల్లమలలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు. కాగా రేణుక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


ముగిసిన రేణుక అంత్యక్రియలు..

మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యురాలు గుమ్మడవెల్లి రేణుక అలియాస్‌ చైతు అలియాస్‌ భాను అంత్యక్రియలు సొంతూరు జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని కడవెండిలో ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రేణుక మృతదేహాన్ని కడసారి చూసేందుకు పలు విప్లవ, ప్రజా, పౌర హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో పాటు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మంగళవారం దంతెవాడ నుంచి అంబులెన్స్‌లో రేణుక మృతదేహాన్ని తీసుకుని బయల్దేరిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి దాటాక స్వగ్రామానికి చేరుకున్నారు. రేణుక పెదనాన్న లక్ష్మీనర్సు ఇంటి వద్ద ఆమె మృతదేహాన్ని చూసి తండ్రి సోమయ్య, సోదరులు జీవీకే ప్రసాద్‌ అలియాస్‌ ఉసెండి, రాజశేఖర్‌తో పాటు గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వీక్షణం పత్రిక ఎడిటర్‌ వేణుగోపాల్‌, నవ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకులు గాదె ఇన్నయ్య, మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్‌, నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి పుష్ప, సీపీఐ నేత సీహెచ్‌ రాజారెడ్డి, సీపీఎం నేత సింగారపు రమేశ్‌, గద్దర్‌ కూతు రు వెన్నెల తదితరులు రేణుకకు నివాళులర్పించారు. కళాకారుల డప్పు చప్పుళ్లు, కోలాటం, విప్లవకారులు, ప్రజాసంఘాల నేతల ఆటపాటలు, నినాదాలతో రేణుక అంతియ యాత్ర సాగింది. గ్రామ శివారులోని వాగు వద్ద రేణుక అంత్యక్రియలు జరపగా.. ఆమె సోదరుడు ప్రసాద్‌ రేణుక చితికి నిప్పంటించారు. కాగా, దండకారణ్యంలో సంపదను దోచి కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని కేంద్రం చూస్తోందని విప్లవ, ప్రజా, పౌర హక్కు ల సంఘాల నేతలు మండిపడ్డారు. రేణుక శరీరంపై గాయాలున్నాయని, చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. ఆపరేషన్‌ కగార్‌ను తక్షణమే నిలిపేయాలని వారు డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 03 , 2025 | 09:00 AM